
కుందూలో పడి..
బండి ఆత్మకూరు: ప్రమాదవశాత్తూ కుందూనదిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు. మండల కేంద్రం బండిఆత్మకూరులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సగిలే రమణ రెడ్డి (59) తన ట్రైసైకిల్‌పై బస్టాండ్ నుంచి ఊరిలోకి వెళ్తున్నాడు. స్థానిక కుందూనది వంతెనపై వెళ్తుండగా ట్రైసైకిల్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. స్థానికులు గమనించేలోపే నీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించి నంద్యాల నందమూరి నగర్ వద్ద ఉన్న కుందూ బ్రిడ్జ్ వద్ద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కుందూనది వంతెనకు ఎలాంటి రక్షణ గోడ లు లేకపోవడంతో తరచు ఇలాంటి ప్రమా దాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
రూ. 5లక్షల నగదు అపహరణ
ఆలూరు రూరల్: బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వెళ్తున్న రూ.5 లక్షల నగదుతో పాటు 5 గ్రాముల బంగారు కమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. హాలహర్వి మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన బాధితుడు గోపాల్ రెడ్డి నెల క్రితం గాలిమరల సంస్థకు పొలం విక్రయించాడు. ఆ నగదు తన ఖాతాలో జమ కావడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆలూరు స్టేట్ బ్యాంకు నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేసుకున్నాడు. నగల దుకాణం నుంచి కొనుగోలు చేసిన 5 గ్రాముల బంగారు, డ్రా చేసుకున్న నగదు సంచిలో ఉంచి తన అల్లుడుతో కలిసి స్కూటర్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఆలూరు సమీపంలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద స్కూటర్ నిలిపి నగదు, ఆభరణాలున్న సంచిని దానిపై ఉంచి మూత్ర విసర్జనకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బ్యాగు మాయమైంది. చోరీ విషయాన్ని బాధితుడు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.