
శుభకార్యానికి వచ్చి.. అనంతలోకాలకు
ఎమ్మిగనూరురూరల్: బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చాడు. అర్ధరాత్రి వరకు సంబరాల్లో పాల్గొన్న ఆ యువకుడు ఆదోనికి వెళ్లి వస్తానని బైక్‌పై బయలుదేరి మృత్యుఒడికి చేరాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆదోని పట్టణంలోని ఇంద్రానగర్ ఎరుకుల కాలనీకి చెందిన మారెన్న కుమారుడు ఎరుకుల లక్ష్మన్న(28) కొంత కాలంగా హైదరాబాద్‌లో వెంట్రుకల వ్యాపారం, ఆదోనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తమ బంధువుల పెళ్లికి భార్య మాధవితో కలిసి వచ్చాడు. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర డీజే పాటలకు నృత్యం చేస్తూ అందరితో సంతోషంగా గడిపాడు. భార్య, బంధువులు వద్దని వారించినా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆదోనికి వెళ్లి ఉదయం వస్తానని బుల్లెట్ బైక్‌పై బయలుదేరాడు. మండల పరిధిలోని కోటేకల్ – ఆరేకల్ గ్రామాల మధ్య ఉన్న కోళ్ల ఫారం దగ్గర బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకుని ప్రమాదం విషయం తెలియజేశారు.