
జడ్జీల నియామకం
నంద్యాల(వ్యవసాయం): జిల్లాకు జడ్జీను నియమిస్తూ సోమవారం హైకోర్టు రిజిస్టార్ ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ఎస్.శ్రీనివాసులు నంద్యాల పీడీఎం కోర్టుకు, నెల్లూరు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పి.వినోద్ డోన్‌కు బదిలీపై రానున్నారు. జడ్జి వినోద్‌కుమార్ సెప్టెంబర్ 14వ తేదీ వరకు ట్రైనింగ్ తర్వాత బాధ్యతలు చేపట్టనున్నారు. నంద్యాల పీడీఎం కోర్టు ఇన్‌చార్జిగా ఉన్న జడ్జి లక్ష్మికర్రి యథాతథంగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతారని కోర్టు సిబ్బంది తెలిపారు.
సర్టిఫికెట్లతో
హాజరు కావాలి
నంద్యాల(న్యూటౌన్): డీసెట్– 2025లో అర్హత సాధించిన విద్యార్థులు సంబంధిత డైట్ కాలేజీల్లో 11 నుంచి 14వ తేదీ వరకు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు.
తాగు, సాగునీరు అందక సీమలో కరువు
నంద్యాల(న్యూటౌన్): తాగు, సాగునీరు అందక రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పందికోన రిజర్వాయర్ కింద 61,400 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉందని, అయితే నేటికీ 10వేల ఎకరాలకు కూడా అందించని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాల్వ కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు అందించేలా కార్యచరణ చేపట్టాలన్నారు. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో 106 చెరువులకు హంద్రీ–నీవా నీటిని నింపి కోనసీమ చేస్తామన్న ముఖ్యమంత్రి దీన్ని 66 చెరువులకు కుదించారన్నారు.
ఆటో డ్రైవర్ల నిరసన
కొలిమిగుండ్ల: రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేయొద్దని కోరుతూ ఆటోడ్రైవర్లు సోమవారం కొలిమిగుండ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాసులును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తే ఆటోడ్రైవర్లకు ఉనికిలేకుండా పోతుందన్నారు. ఈ పథకంపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.

జడ్జీల నియామకం