
జాతీయ సమైక్యత కోసం‘తిరంగా’ ర్యాలీ
నంద్యాల: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జాతీయ సమైక్యత కోసం ఈనెల 12న నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకూ హర్ ఘర్ తిరంగాపై ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లాలో నిర్వహించే ’హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహణపై సోమవారం జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీల్లో, మండలాల్లో, జిల్లా కేంద్రంలో నిర్వహించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పౌరులు, విద్యార్థిని, విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత్ సరోవర్ పనులు జరిగిన ప్రాంతాల్లో ఫొటోలు దిగి సంబంధిత సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను త్రివర్ణ రంగులతో కూడిన దీపాలతో అలంకరించాలన్నారు. అదే విధంగా హర్ ఘర్ తిరంగా సైట్‌లో అందరూ నమోదై, అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.