
పూల మాటున ‘పచ్చ’ డ్రామా!
● పూల వ్యాపారంలో పోటీ లేకుండా
టీడీపీ నేత ఎత్తుగడ
● సహచరుడి జీపులను పోలీసులకు
పట్టించిన తెలుగు తమ్ముడు
● పూలమండి ఎత్తేస్తే కేసు లేకుండా
చేస్తానంటూ హామీ
● వాహనాలు వదిలేసేందుకు పోలీసులు
రూ.3 లక్షలు డిమాండ్?
ఆళ్లగడ్డ: అధికార పార్టీ అనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. అధికారులు, పోలీసులు తమ చేతుల్లో ఉన్నారంటూ పచ్చ డ్రామాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు, కట్టడాలను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్న చాగలమర్రికి చెందిన టీడీపీ నేత తాజాగా తన వ్యాపారానికి అడ్డొస్తున్నాడని ఓ వ్యాపారిని స్థానిక పోలీసుల సహాయంతో బెదిరించి భయబ్రాంతులకు గురిచేశాడు. టీడీపీ నాయకుడి తీరు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో చర్చనీయాంశమవుతోంది. చాగలమ్రరిలో కొన్నేళ్లుగా పూల వ్యాపారం (మండి) చేస్తున్న టీడీపీ నేత తన పలుకుబడి, రౌడీయిజంతో పోటీగా ఎవరినీ వ్యాపారం చేసుకోకుండా అడ్డుకుంటూ రూ. కోట్లు గడిస్తున్నాడు. ఎవరూ పోటీ లేక పోవడంతో ఇతను చెప్పిందే ధర. ఇతను ఎంత చెబితే అంతకే రైతులు విక్రయించాల్సిన దుస్థితి. అయితే ఈ మధ్య కాలంలో పొరుగునే ఉన్న వైఎస్సార్ జిల్లా ఇడమడక గ్రామానికి చెందిన హుస్సేన్‌బాషా అనే వ్యాపారి చాగలమర్రిలో పూల వ్యాపారం (మండి) ప్రారంభించాడు. దీంతో అతనికి పోటీగా రైతులకు ధర ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావించిన టీడీపీ నేత తనకు పోటీగా పూల వ్యాపారం (మండి) నిర్వహిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులతో కలసి నాటకం మొదలు పెట్టాడు.
వాహనాలు పట్టించి ..
విడిపించినట్లు కలరింగ్ ఇచ్చి..
శుక్రవారం రాత్రి దాదాపు రూ. 8 లక్షల విలువైన పూల లోడ్‌తో హుస్సేన్‌బాషాకు చెందిన రెండు వాహనాలు హైదరాబాద్‌కు బయలుదేరాయి. అయితే టీడీపీ నేత ఆదేశాలతో పోలీసులు హైవేపై కాపు కాసి రెండు జీపులను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌కు చేరాల్సిన పూలు స్టేషన్‌కు తరలించారు. ఆలస్యమైతే పూలు పాడైపోతాయంటూ సహచర పూల వ్యాపారి అయిన టీడీపీ నేత రంగంలోకి దిగినట్లు నటన మొదలు పెట్టాడు. ప్రస్తుతం పూలు అయినా వదిలి పెడితే వేరే వాహనంలో హైదరాబాద్ తరలిస్తామని పోలీసులతో మాట్లాడినట్లు షో చేశాడు. ఎస్‌ఐకి రూ. 50 వేలు ఇస్తే పూలు తరలించుకోవచ్చని టీడీపీ నేత చెప్పడంతో అంత ఇవ్వలేమని రూ. 40 వేలు ఒప్పుకుని వ్యాపారి హుస్సేన్‌బాషా టీడీపీ నేతకు ఫోన్‌పే చేశాడు. పూలను ఇతర వాహనంలో హైదరాబాద్‌కు తరలించాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో వ్యాపారి తీవ్రంగా నష్టపోయాడు. కిలో రూ.250 నుంచి రూ. 400 వరకు విక్రయించాల్సిన పూలు కేవలం రూ.100కే అమ్ముడుపోయాయి. దీంతో సుమారు రూ. 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోతున్నాడు.
రూ. 3 లక్షలు ఇస్తావా..
మండి ఖాళీ చేస్తావా?
రికార్డులు సరిగా లేకుంటే జరిమానా వేసి తమ జీపులు వదిలి పెట్టాలని వ్యాపారి శనివారం పోలీసులను ఆశ్రయించగా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన కనిపించ లేదు. అంతలో స్థానిక పూల మండి యజమాని అయిన టీడీపీ నాయకుడు బాధిత యజమానిని పిలిపించి రెండు వాహనాలు స్టేషన్ నుంచి విడిపించాలంటే చాగలమర్రిలో పూల మండిని ఎత్తేయాలని ఆదేశించాడు. అందుకు వ్యాపారి ఒప్పుకున్నాడు. తర్వాత పోలీసు స్టేషన్ దగ్గరకు వెళ్లండి ఎస్‌ఐతో మాట్లాడతానని చెప్పి పంపించాడు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లిన బాధితుడు పోలీసుల తీరు చూసి అవాక్కయ్యాడు. ‘మీరు.. మీరు మాట్లాడుకుంటే సరిపోతుందా మాకేంటి’ అంటూ గట్టిగా మందలించడంతో నిర్ఘాంత పోయాడు. మళ్లీ టీడీపీ నేతను సంప్రదించగా ‘పోలీసులు రూ.3 లక్షలు అడుగుతు న్నారు.. ఇచ్చి వాహనాలు తీసుకుపో’ అని అనడంతో వ్యాపారి ఏమి చేయాలో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

పూల మాటున ‘పచ్చ’ డ్రామా!