మళ్లీ రేపు తెరుచుకోనున్న గేట్లు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి సగటున 1,90,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దిగువ ప్రాజెక్ట్‌లకు సగటున 1,31,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. జలాశ య పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 191.2118 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో మంగళవారం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను తెరిచి నీటిని సాగర్‌కు విడుదల చేయనున్నారు.
శనివారం నుంచి ఆదివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు 1,49,604 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,729 క్యూసెక్కుల నీటిని వదిలారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 68,510 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 32,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.741 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.232 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 880.60 అడుగులకు చేరుకుంది.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున నుంచి పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామస్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
ప్రకృతి వ్యవసాయంలో రాణించాలి
శిరివెళ్ల: ప్రకృతి వ్యవసాయంలో రైతులు రాణించాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చెన్నూరులో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన వివిధ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఔత్సాహిక మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు. మహదేవపురం, బోయలకుంట్ల, యర్రగుంట్ల, కాదరబాదరలో ఆకు కూరలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నా రు. ఆయన వెంట ఎంటీ రామాంజనేయ రెడ్డి, ఎన్‌ఎప్‌ఎస్ డీఏ రాముడు పాల్గొన్నారు.