
భార్య కాపురానికి రాలేదని..
కోవెలకుంట్ల: పట్టణంలోని ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన ఓ యువకుడు ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మిద్దె అశోక్(35) స్థానిక ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ పద్ధతిన బస్సులు స్వీపింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో ఇటీవలే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
నకిలీ సమాచారాన్ని నమ్మొద్దు
నంద్యాల(వ్యవసాయం): ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఏపీఎస్‌ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిణి రజియాసుల్తానా ఆదివారం తెలిపారు. డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు పర్సనల్ అధికారి తెలిపినట్లుగా ఒక దిన పత్రికలో వార్త ప్రచురితమయిందన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, పర్సనల్ అధికారి ఎలాంటి ప్రకటనను జారీ చేయలేదని, కావున ప్రజలు, నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉపాధ్యాయుడు మృతి
కర్నూలు సిటీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎమ్మిగనూరు బాలురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వి.శివనాగరాజు(45)కు ఉల్చాల రోడ్డు జంక్షన్‌లో ఈ నెల 8న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తలకు గాయాలు కావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు హాస్సిటల్‌లో శస్త్ర చికిత్స చేశారు. అయితే చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందారు. వి.శివనాగరాజుకు భార్య ప్రియాంక, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. విషయం తెలుసుకున్న డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్రెక్రిష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాముడు, గట్టు తిమ్మప్ప, గోట్ల చంద్రశేఖర్‌లు హాస్పిటల్‌కి వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.