
తెగిపోయిన రోడ్డు
● స్తంభించిన రాకపోకలు
కొలిమిగుండ్ల: భారీ వర్షానికి అనంతపురం జిల్లా బుగ్గ సమీపంలోని రోడ్డు తెగిపోయింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా సరిహద్దుకు 50 మీటర్ల సమీపంలో అనంతపురం జిల్లా బుగ్గకు చేరువలో అనంతపురం–అమరావతి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో అక్కడ వాహనాల రాక పోకల కోసం సర్వీస్ రోడ్డు నిర్మించారు. భారీ వర్షం కురవడంతో వాగు నీటికి రోడ్డు కొట్టుకుపోయింది. వందల సంఖ్యలో వాహనాలు ఇరువైపులా బారులుతీరాయి. చాలా మంది ట్రాఫిక్‌లో నిలిచిపోవడంతో పెళ్లిళ్లకు చేరుకోలేక పోయారు. ఆదివారం కావడంతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లల కోసం పాఠశాలలు, కాలేజీల వద్దకు వెళ్లెందుకు తెల్లవారు జాము నుంచి బస్సులు కోసం నిరీక్షించినా ఫలితం లేకుండా పోయింది. మూడు జిల్లాలకు సరిహద్దులో ఉన్న కొలిమిగుండ్ల ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణిలకులతో రద్దీగా మారిపోయింది. బనగానపల్లె, జమ్మలమడుగు డిపో బస్సులు జిల్లా సరిహద్దులో ఉన్న రాయల్టీ చెక్‌పోస్టు వరకు మాత్రమే వెళ్లి అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చాయి. బస్సుల కోసం గంటల సమయం ఎదురుచూడాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రవాణా స్తంభించడంతో కొలిమిగుండ్లతో పాటు అవుకు, బనగానపల్లె, వైఎస్సార్‌జిల్లా, తాడిపత్రి ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది.