
శ్రీమఠం.. భక్తి పరిమళం
● పరిమళ తీర్థంలో తొలిసారి అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
● ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఘనంగా ఊంజల సేవ
మంత్రాలయం: వేదభూమిలో తొలి వేడుక.. సద్గురు రాఘవేంద్రుడి క్షేత్రంలో శుభకార్యం.. తిరుమల వేంకన్న, శ్రీశైల మల్లన్న తరహాలో శ్రీమఠంలో పురుడోసుకున్న తెప్పోత్సవం.. చూసిన కనులదే భాగ్యం..ఈ వేడుకను చూసి భక్తజనం పరవశించింది. తుంగభద్ర నది తీరంలో ఆధ్యాత్మికభావం వెల్లివిరిసింది. శ్రీ రాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాలు రెండోరోజు శనివారం వైభవంగా సాగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో సూర్యాస్తమయ సమయాన ఉత్సవమూర్తి తెప్పోత్సవం శోభాయమానంగా సాగింది. తొలుత రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి ఉత్సవమూర్తిని మేళతాళాలతో శ్రీమఠం నుంచి పరిమళ తీర్థం పుష్కరిణికి చెంతకు తీసుకొచ్చారు. అక్కడ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పరిమళ తీర్థానికి పూజలు చేసి ఉత్సవమూర్తిని తెప్పపై అధిష్టింపజేశారు. ఉత్సవమూర్తికి పుష్పార్చనలు, హారతులు పట్టి తెప్పోత్సవానికి అంకురార్పణ పలికారు. పుష్కరిణి చూట్టూ వేలాది భక్తుల హర్షధ్వానాలు, వేద ఘోషలు, మంగళవాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలు విహరించారు.