
సీఐ, డాక్టర్ మధ్య ‘పోస్టుమార్టం’ వివాదం
శ్రీశైలంప్రాజెక్ట్: పోస్ట్‌మార్టం విషయంలో శుక్రవారం సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ లీలా వినయ్‌రెడ్డి, శ్రీశైలం సీఐ ప్రసాదరావు మధ్య సెల్‌ఫోన్‌లో వివాదం నెలకొంది. శ్రీశైలం రామయ్య టర్నింగ్ వద్ద గురువారం రాత్రి ఎదురెదురుగా బైక్‌లు ఢీకొన్న ఘటనలో శ్రీశైలానికి చెందిన హరినాయక్ మృతి చెందాడు. మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం ఫారం, ఇంక్వెస్ట్, పాస్‌పోర్ట్‌లను డాక్టర్‌కు పోలీసులు సమర్పించారు. పోలీసులు సమర్పించిన రిపోర్టులు సక్రమంగా లేవని ఇన్వెస్టిగేషన్ అధికారి సీఐ ప్రసాదరావు స్వయంగా రావాలని డాక్టర్ మొండికేశారు. దీంతో సీఐ తన ఫోన్‌లో డాక్టర్‌తో మాట్లాడారు. ‘నీవు చదువుకున్నావా లేదా, నీకు అసలు చదువు వచ్చా, 1(12) ఫారంలోని కాలం 30 ప్రకారం ఇన్వెస్టిగేషన్ అధికారి పోస్టుమార్టానికి హాజరు కావాల్సిన అవసరం లేదు’ అని తెలుసుకో అని మాట్లాడారు. ఈ విషయంపై ఒకరినొకరు వాదులాడుకున్నారు. పోస్టుమార్టం ఆలస్యం అవుతుండడంతో మృతుని బంధువులు ఆసుపత్రివద్ద గొడవకు దిగారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఫారం1(12), ఇన్‌క్వెస్ట్ రిపోర్టు సక్రమంగా లేవని, సీఐ ప్రసాదరావు తనను ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని డాక్టర్ వినయ్ రెడ్డి ఆసుపత్రి బయట శనివారం ఓపీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ.. గతంలో వాహనాల తనిఖీ, ట్రాఫిక్ కంట్రోల్ సమయాలో వైద్య సిబ్బంది వాహనాలు పట్టుకున్నామని, వీటిని వ్యక్తిగతంగా తీసుకొని వైద్యులు, సిబ్బంది తమకు సహకరించడం లేదని తెలిపారు.