మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాషా్ట్రల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్లలో బారులు తీరా రు. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని ఉద యం 9.30 ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేర ప్రవృత్తిని వీడండి
నంద్యాల: నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐలు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రౌడీషీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా ఉంటుందని, కావున సత్ప్రవర్తనలో నేరప్రవృత్తిని మానుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పోలీసు సూచనలు ఖాతరు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
23న ఆలయ భూముల బహిరంగ వేలం
ఓర్వకల్లు: మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ ఆలయ భూము లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు గ్రూపు దేవస్థానం ఈఓ చంద్రేఖర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి 11 ఎకరాలు, రామస్వామి దేవస్థానానికి ఉన్న 11.31 ఎకరాలు, చెన్నకేశవస్వామి దేవస్థానానికి సంబంధించి 257.14 ఎకరాల భూములకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన రైతులు అదే రోజు ఉదయం 10 గంటలలోగా రూ.2 వేలు డిపాజిట్ చెల్లించాలని తెలిపారు. పాత బకాయిలు ఉన్న వారు వేలం పాటకు అనర్హులుగా ప్రకటించారు.
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
డోన్ టౌన్: అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమానికి జిల్లా అగ్నిమాపక అధికారి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక అగ్నిమాపక కేంద్రంలో ప్రజలకు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవహరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి బాలరాజు, డోన్ కేంద్రం అధి కారి రంగస్వామిగౌడ్ మాట్లాడుతూ.. గాలిలో ఆక్సిజన్ ఉండడం వల్ల మంటలు వ్యాప్తి చెందుతాయని తెలిపారు. నివారించేందుకు కార్బన్ డయాక్సైడ్‌ను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ప్రభాకర్, రంగస్వామి, చంద్రశేఖర్, రాజు, రాజశేఖర్, నాగేంద్రబాబు పాల్గొన్నారు.


