సాంఘిక సంక్షేమ శాఖ జేడీ బదిలీ
కర్నూలు(అర్బన్): జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జె.రంగలక్ష్మిదేవిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ గురువారం జీవో ఆర్టీ నెం.80ని జారీ చేశారు. 2023 జూన్ 12న ఆమె ఇక్కడ జేడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతానికి ఇక్కడకు డిప్యూటీ డైరెక్టర్‌గా ఎవరినీ నియమించలేదు.
కనిష్ట స్థాయికి ఉల్లి ధర
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర కనిష్టస్థాయికి పడిపోతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో అక్కడక్కడ బావులు, బోర్లు, ఇతర నీటిపారుదల కింద ఉల్లి సాగయింది. కర్నూలు మార్కెట్‌కు ఎనిమిది మంది రైతులు మా త్రమే 479 క్వింటాళ్ల ఉల్లి తెచ్చారు. క్వింటాకు కనిష్టంగా రూ.675, గరిష్ట ధర రూ.879 మాత్రమే లభించింది. సగటు ధర రూ.755 నమోదైంది. జిల్లాకు మహారాష్ట్రలో పండించిన ఉల్లి భారీగా దిగుమతి అవుతోంది. ఉల్లితో పాటు మిర్చి, వాము, వేరుశనగ, శనగ తదితర అన్ని పంటల ధరలు పడిపోయాయి. క్వింటా మిర్చి ధర రూ.4వేల నుంచి రూ.7వేల వరకు మాత్రమే పలుకుతోంది.


