ప్రాణం తీసిన వాటర్ ఫిల్టర్ బెడ్ గుంత
నంద్యాల: పట్టణంలోని మున్సిపల్ పార్కులో వాటర్ ఫిల్టర్ బెడ్ కోసం ఏర్పాటు చేసిన గుంతలో పడి ఒక బాలుడు మృతి చెందాడు. టూటౌన్ సీఐ ఇస్మాయిల్ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణానికి చెందిన మన్సూర్, రజియా కుమారులు అయాన్, అలీ మున్సిపల్ పార్కులో సోమవారం సాయంత్రం 4గంటల సమయంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. బ్యాటింగ్ చేస్తుండగా బాల్ ఎగిసిపడి వాటర్ ఫిల్టర్ బెడ్‌కు తీసిన గుంతలో పడిపోయింది. ఈ బాల్‌ను తీయడానికి తమ్ముడు అయాన్ గుంతలో దిగారు. గుంతలో పడి తమ్ముడు మునిగిపోవడాన్ని గమనించిన అన్న అలీ పైకి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గుంతలో పడి అయాన్(7) మృతి చెందాడు. తమ్ముడిని బయటకు తీయడానికి ప్రయత్నించిన అన్న కూడా నీటి గుంతలో పడటంతో చుట్టుపక్కలున్న వారు గమనించి రక్షించారు. అయాన్ గుంతలో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడి వచ్చి విలపిస్తున్న తీరు అందరినీ కలచి వేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇస్మాయిల్ తెలిపారు.
మున్సిపల్ అధికారులే నిర్లక్ష్యమే కారణమా?
పట్టణంలోని మున్సిపల్ పార్కుకు ప్రతి రోజూ వందలాది మంది వస్తుంటారు. ఈ పార్కులో ఈ మధ్యకాలంలో వాటర్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ఫిల్టర్ బెడ్ చుట్టూ 4 నుంచి 5 అడుగుల గుంత తీశారు. గుంత పనులు పూర్తి కాలేదు. వందలాది మంది ప్రజలు పార్కుకు వస్తుంటారని తెలిసినా గుంత చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో ఆడుకోవడానికి వచ్చిన అయాన్ గుంతలో పడి మృతి చెందడంతో స్థానికులు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కులో గుంత పనుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకుండా చిన్నారి మృతికి కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులే కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారుల
నిర్లక్ష్యమే కారణమా?
ప్రాణం తీసిన వాటర్ ఫిల్టర్ బెడ్ గుంత


