పిడకల సమరం.. ప్రేమదే విజయం
ఆస్పరి: ప్రేమికులను విడదీసే పెద్దలు చూసుంటాం.. విషాదాంతం అయిన ప్రేమ కథలను వింటూ ఉంటాం. ప్రేమను గెలిపించే పోరాటం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి పోరాటమే ఒకటి ఆచారంగా ప్రతి ఏటా ఆస్పరి మండలంలోని కై రుప్పల గ్రామంలో కొనసాగుతోంది. వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహోత్సవాలు సందర్భంగా సోమవారం రెండు వర్గాల భక్తుల మధ్య ఉత్కంఠ భరితంగా పిడకల సమరం సాగింది. ఆచారం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీ మార్బలంతో ఊరేగింపుగా కై రుప్పల గ్రామానికి వచ్చారు. వీరభద్రస్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరిగారు. ఆతరువాత పిడకల సమరం మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు పరస్పరం ఒకరిపై ఒకరు పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో గాల్లోకి పిడకలు లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపు అయ్యింది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులు, గుంపులుగా కదిలారు. ఒక సారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, మరో సారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి బండారు పూసుకున్నారు. ఈ సమరాన్ని జనం ఆసక్తిగా చూశారు. కేకలు, ఈలలతో హోరెత్తించారు. పిడకల సమరంలో రెండు వర్గాలకు చెందిన 30 మంది స్వల్పంగా గాయపడ్డారు. జనంతో కై రుప్పల కిట కిటలాడింది. సమరంలో గొరవయ్యల నృత్యం ఆకట్టుకుంది. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆలయ కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, సర్పంచ్ తిమ్మక్క గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, ఆస్పరి సీఐ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పోరు ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు.. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిలకు వివాహం చేసేందుకు నిశ్చయించారు.
పిడకల సమరం.. ప్రేమదే విజయం
పిడకల సమరం.. ప్రేమదే విజయం
పిడకల సమరం.. ప్రేమదే విజయం


