శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కైలాస ద్వారం, హఠకేశ్వరం, సాక్షి గణపతి వద్ద చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ పాదయాత్రగా వచ్చే భక్తులు కైలాసద్వారం వద్ద సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. అక్కడి నుంచి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ మార్గంలో ఆరు చోట్ల 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆరు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. కై లాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించారు. కాలిబాటలో ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈఓ వెంట ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి, పారి శుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు పీవీ సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజినీర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఈఓ శ్రీనివాసరావు


