రుద్రవరం: అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెలిమ రేంజ్ పెద్దకంబలూరు సెక్షన్ అధికారి కిషోర్ తెలిపారు. బుధవారం ఆయన ఎఫ్‌బీఓ రామారావుతో కలిసి పెద్దకంబలూరు వంతెన వద్ద గేటు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ తెలుగుగంగ ప్రధాన కాల్వ నిర్మించే సమయంలో అటు వైపు గ్రామాల ప్రజల అవసరాల నిమిత్తం పెద్దకంబలూరు వద్ద వంతెన ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామంతో పాటు అప్పనపల్లె, పందిర్లపల్లె తదితర గ్రామాల ప్రజలు ఆ వంతెన మీదుగా లోపలికి వెళ్లి పశువులను మేపుకొని తిరిగొచ్చేవారు. అయితే, కొందరు దుండగులు ఆ దారిన అడవిలోనికి వెళ్లి నేరానికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోని అడవిలోకి రాక పోకలు నిషేధిస్తూ గేటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.త్వరలో తెలుగుగంగ ప్రధాన కాల్వ కట్టపై ఓ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతులిచ్చారన్నారు. బేస్ క్యాంప్ ఏర్పాటు అయితే నల్లమల అటవీ సంరక్షణకు మరింత మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.


