నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 130 పరీక్ష కేంద్రాల్లో బుధవారం హిందీ పరీక్ష నిర్వహించగా 24,785 మందికి గాను 24,418 మంది విద్యార్థులు (98.51శాతం) హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 367 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలను ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పరిశీలించాయన్నారు. ఎస్పీజీ స్కూల్ పక్కన ఉన్న ఎస్పీజీ జూనియర్ కళాశాలలోకి పరీక్ష కేంద్రాన్ని బుధవారం మార్పు చేసినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలో తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో 509మంది విద్యార్థులకు గాను 454 మంది విద్యార్థులు (88.41శాతం) పదోతరగతి ఓపెన్ ఆంగ్లం పరీక్షకు హాజరయ్యారన్నారు. మొత్తం 59మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు.
పన్నుల ఆదాయం రూ.10.43 కోట్లు
చాగలమర్రి: నంద్యాల జిల్లాలోని 489 గ్రామ పంచాయితీలకు పన్నుల రూపంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.10.43 కోట్ల ఆదాయం సమకూరిందని జిల్లా పంచాయతీ అధికారి జమివుల్లా తెలిపారు. చాగలమర్రిలోని ఐదు సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం ద్వారా జిల్లాలోని 489 పంచాయితీలకు రూ.28.00 కోట్లు వచ్చాయని, ఈ నిధులను వివిధ పనులకు వినియోగించాల్సి ఉందన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు చేపట్టారని, పది రోజుల్లో ఆ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారని తెలిపారు.
జిల్లాలో ఐదు ‘శక్తి’ బృందాలు
బొమ్మలసత్రం: మహిళల రక్షణ కోసం జిల్లా లో ఐదు శక్తి బృందాలను ఏర్పాటు చేశామని, బృంద సభ్యులు నిత్యం పనిచేస్తారని ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు, బాలికల రక్షణ కోసమే శక్తి యాప్‌ను అందుబాటులోకి తెచ్చారని, మొబైల్ ఫోన్‌లలో ఈ యాప్ వినియోగించుకోవాలన్నారు. మహిళలు ఏదైనా ఆపదలో ఉంటే 112 నంబరుకు గానీ ఎస్‌వోఎస్ బటన్‌నుకు నొక్కితే వెంటనే పోలీసులు వారిని సమీపిస్తారన్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు వార్డు మహిళా పోలీసులను నియమించామన్నారు.
దివ్యాంగ విద్యార్థినికి
ప్రత్యేక డెస్క్
పగిడ్యాల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పడమర ప్రాతకోటకు చెందిన దివ్యాంగురాలైన విద్యార్థిని రాజేశ్వరికి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ‘‘అధికారులూ.. కనిపిస్తోందా’’ అని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు ఈ మేరకు స్పందించారు. పదో తరగతి పరీక్షలు రాసే దివ్యాంగులకు విధిగా గ్రౌండ్‌ఫ్లోర్‌నే అధికారులు కేటాయించాల్సి ఉండగా.. దివ్యాంగురాలైన విద్యార్థిని రాజేశ్వరికి మొదటి ఫ్లోర్‌లో పరీక్ష గది కేటాయించారు. కుమార్తెను ఆ ఫ్లోర్‌కు చేర్చడానికి తల్లి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తల్లి కష్టంపై ‘సాక్షి’ దినపత్రికలో వార్త రావడంతో బుధవారం హిందీ పరీక్ష రాసేందుకు వెళ్లిన దివ్యాంగురాలైన విద్యార్థిని రాజేశ్వరికి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేశారు.


