టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్‌ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్‌ ప్రభుత్వం

Published Sat, Oct 14 2023 2:06 AM

- - Sakshi

‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం చివరికి ఎవరికి ఓటు వేసారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని ఎన్నికల వేళ ఏదైతే చెప్పామో.. ఆ చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను తూచా తప్పకుండా అందరికీ అందించాం. నా వాళ్లు, కాని వాళ్లు అని ప్రజలను విభజించే జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేసి, ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ నా వాళ్లే అనే గొప్ప సందేశాన్ని ఈ నాలుగేళ్ల కాలంలో ఇవ్వగలిగాం’.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పారదర్శక పాలన గురించి ఇలా వివరించారు. సంక్షేమ పథకాలే కాదు పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని చెప్పేందుకు నంద్యాలకు చెందిన టీడీపీ కార్యకర్తనే నిదర్శనం.

నంద్యాల(అర్బన్‌): ఆయనొక కరుడుగట్టిన టీడీపీ వీరాభిమాని. అంతటి అభిమానికి గుండె సంబంధిత వ్యాధి సోకింది. పార్టీ కోసం పాటు పడిన కార్యకర్త మృత్యువుతో పోరాడుతున్న విషయం పార్టీ ఇన్‌చార్జ్‌లకు తెలిసింది. అయినా సహాయం అందించక పోగా కనీసం పరామర్శకు కూడా రాలేదు. ఆ గుండెకు ఏమి కాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక సహాయం చేసి ప్రాణాన్ని నిలిపారు. నంద్యాల మండలం అయ్యలూరు మెట్టకు చెందిన దాది నాగేశ్వరరావు కొద్ది నెలల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ నంద్యాల, కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఈ వ్యాధి పరిధిలోకి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని కాపాడుకునేందుకు పార్టీలను పక్కనపెట్టిన కుమారులు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు బసవేశ్వరరెడ్డి, రవికుమార్‌ రెడ్డిల ద్వారా విషయాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలు ముఖ్యం కాదని, ఓ ప్రాణాన్ని కాపాడటానికి మానవతా దృక్పథంతో ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మంజూరయ్యేలా ఎమ్మెల్యే శిల్పా రవి సీఎంఆర్‌ఎఫ్‌కు సిఫారసు చేశారు. ఎమ్మెల్యే లెటర్‌ తీసుకున్న నాగేశ్వరరావు కుమారులు నాగరాజు, నాగార్జున అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

అక్కడి నుంచి ఎమ్మెల్యే శిల్పారవితో ఫోన్‌ చేయించుకోవడంతో రూ.8.50 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ త్వరితగతిన విడుదల అయ్యింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో నాగేశ్వరరావుకు ఆగస్టు నెలలో హైదరాబాద్‌ నిమ్స్‌లో ఆపరేషన్‌ చేయించారు. క్షేమంగా ఇంటికి చేరుకున్న ఇంటి పెద్దను చూసి కుటుంబీకులు సంతోషించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగేశ్వరరావు బతికేందుకు సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని అతని భార్య లక్ష్మీదేవి, కుమారులు నాగరాజు, నాగార్జున చెబుతున్నారు.

నాగేశ్వరరావు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ పరామర్శించడానికి రాలేదన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వచ్చి భరోసా కల్పించారన్నారు. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని చెప్పడంతో ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. టీడీపీకి చెందిన ఫొటో లను కేసీ కాల్వలో పడేశామని, ప్రస్తుతం తమ కుటుంబానికి జగనన్నే దేవుడు అని చెబుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement