తప్పు చేసినా.. మనవాడైతే ఓకే!
శ్రీశైలంటెంపుల్: భక్తులకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా, మోసం చేసినా టీడీపీకి అనుకూలంగా ఉంటే ఓకే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భక్తుల నుంచి ఫిర్యాదు రాలేదనే సాకుతో తప్పు చేసిన వ్యక్తికే తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇప్పిస్తున్నారు. టీడీపీకి సంబంధం లేని వ్యక్తులు ఎటువంటి తప్పు ఏయకపోయినా, భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోయినా వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మానసికంగా హింసిస్తూ..రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న అరోపణలు వినిపిస్తున్నాయి.
రీ–పోస్టింగ్
గత సంవత్సరం డిసెంబరు 24న ఉత్తరాఖాండ్‌కు చెందిన హిందీ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు. వసతి కోసం మల్లికార్జున సదన్‌లోని డార్మెంటరీలో ఏడు బెడ్లు తీసుకున్నారు. డార్మెంటరీలో ఒక రోజుకు ఒక బెడ్ రుసుం రూ.250 చెల్లించాలి. ఈ లెక్కన వారి వద్ద నుంచి రూ.1750తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ సైతం తీసుకోవాలి. వారికి బిల్లు ఇవ్వాలి. అయితే ఆ కౌంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పి.ఉదయ్‌కుమార్ వారి వద్ద నుంచి రూ.2వేలు తీసుకుని, బిల్లు ఇవ్వకుండా, ఆ డబ్బును తన జేబులోకి వేసుకున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పంధించిన దేవస్థాన అధికారులు విచారణ జరిపి కౌంటర్ విధులు నిర్వహిస్తున్న పి.ఉదయ్‌కుమార్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేశాడని ధృవీకరించుకుని అతనిని విధుల నుంచి తప్పించారు. అయితే సదరు ఉద్యోగి నియోజకవర్గ స్థాయి రాజకీయ నేతకు సన్నిహితంగా ఉండడంతో..రాజకీయ నేత మనవాడికి పోస్టింగ్ ఇచ్చేయండని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద దేవస్థాన అధికారులు, సంబంధిత విభాగపు అధికారి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేయలేదన్నట్లు ఫైల్ రాయడంతో, దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి పేరుతో రీ పోస్టింగ్‌కు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆదివారం సదరు ఉద్యోగి తిరిగి అదే స్థానంలో ఉద్యోగంలో చేరారు. సదరు ఉద్యోగి తప్పు చేయకపోతే మూడు నెలల పాటు ఎందుకు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు, ఉద్యోగి భక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయకపోతే అప్పటి సీసీ ఫుటేజ్‌ను బహిర్గంతం చేయవచ్చు కదా! భక్తులను, దేవస్థానాన్ని మోసం చేసిన వ్యక్తిని కేవలం భక్తుల నుంచి ఫిర్యాదు లేదనే సాకును చూపి అతనికి రీ–పోస్టింగ్ ఇచ్చేశారు.
పోస్టింగ్ ఇవ్వకుండా..
గత సంవత్సరం జనవరి నెలలో శ్రీశైల దేవస్థాన టోల్‌గేట్‌లో అకస్మిక తనిఖీలు నిర్వహించగా సిబ్బంది వద్ద ఉండాల్సిన డబ్బు కంటే అదనపు డబ్బును అధికారులు గుర్తించారు. దేవస్థాన అధికారులు విచారణ జరిపి టోల్‌గేట్‌లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం.రామకృష్ణుడు(హెల్పర్), కాంట్రాక్ట్ లేబర్లు బి.నాగపరమేశ్వరుడు, జి.మల్లికార్జునరెడ్డి, ఎన్.గోవిందు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బి.మల్లికార్జునరెడ్డి, బీ.ఆర్.మల్లేశ్వర్‌రెడ్డి, జి.శ్రీనివాసులు, డైలీ వేజ్ సిబ్బంది కె.కె.రాజు లను విధుల నుంచి నిలుపుదల చేశారు. వీరిలో ఎం.రామకృష్ణుడుకి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారందరికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందులో ఇద్దరు ఉద్యోగులు సైతం తాము ఏ తప్పు చేయలేదని కోర్టు మెట్లెక్కారు. కమిషనర్, కోర్టు కూడా వీరిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పిన ఇంత వరకు విధుల్లోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగులు తప్పులు చేసిన వారికి ఒకలా, ఇతరులకు మరోలా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. టోల్‌గేట్ వ్యవహరంలోనూ భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని సమాచారం. భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోతే సిబ్బందికి పోస్టింగ్ ఇవ్వోచ్చు కదా. కేవలం రాజకీయ కక్షతో వీరిని ఇబ్బందులకు గరిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీశైల దేవస్థానంలో
తప్పుచేసిన వ్యక్తికి వత్తాసు
తిరిగి
అదే స్థానంలో పోస్టింగ్
టోల్‌గేట్ సిబ్బంది తొలగింపు
సంవత్సరం అయినా
పోస్టింగ్ ఇవ్వని వైనం
రాజకీయ కక్ష తీర్చుకునేందుకు
శ్రీశైల దేవస్థానాన్ని రాజకీయ కక్ష సాధింపులకు, వేధింపులకు వేదికగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంటుందనే అరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేకపోయిన టీడీపీ నాయకుల అనుచరులకు కీలకమైన పోస్టింగులు ఇవ్వడంతోపాటు అనుకూలమైన వారికి దేవస్థానంలో ఆదాయం వచ్చే స్థానాల్లోకి బదిలీ చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగుల అంతర్గత బదిలీ చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఉన్నప్పటికి వాటిని పాటించడం లేదు. అంతేకాకుండా చిన్న పాటి ఉద్యోగులను సైతం ఎన్నికల్లో ప్రచారానికి తిరిగారని వారికి పోస్టింగులు ఇవ్వకుండా సంవత్సరం పాటు వేధింపులకు గురి చేశారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగులను బదిలీలు, వారిపై విధుల పట్ల అలసత్వం పేరుతో రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులకు గురిచేస్తున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి.


