అంగన్‌వాడీ వర్కర్ల, హెల్పర్ల అక్రమ అరెస్టులు
కర్నూలు(సెంట్రల్)/డోన్ టౌన్: విజయవాడలో మార్చి 2వ తేదీన చేపట్టే మహాధర్నాలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొనకుండా పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడ వెళ్తున్న వారిని డోన్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు. విజయవాడకు వెళ్లడానికి వీలులేదని పోలీసులు చెప్పడంపై అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా ఇచ్చిన పిలుపుమేరకు మార్చి 2 వతేదీన చలో విజయవాడకు బయలు దేరి వెళ్తుండడంతో పోలీసులు వారిని వెళ్లనీయకుండా ఎక్కడిక్కడే అరెస్టు చేస్తుండడంపై సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, అంగన్‌వాడీ ఎంప్లాయీస్ అండ్ హెల్పర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.నిర్మలమ్మ ఖండించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డుల అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్‌లో ఉన్న 1810 మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.


