నూతన కార్యవర్గంలో
తెలంగాణకు ప్రాతినిధ్యం
రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన నల్లగొండ గడ్డపై అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు భవిష్యత్ ఉద్యమానికి సమరశంఖం పూరించాయి. వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువతీ యువకుల భాగస్వామ్యంతో సాగిన మహాసభలు వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు నిర్మిస్తామని ప్రతినిధులు ప్రతినబూనారు. మహాసభల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 16 వరకు స్థానిక క్లాక్ టవర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అగ్రి షో రైతులను విశేషంగా ఆకట్టుకుంది. నవంబర్ 15న లక్షలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులతో నిర్వహించిన మహా ర్యాలీ నల్లగొండను ఎర్ర సముద్రంలా మార్చివేసిందని నాయకులు కొనియాడారు. 16 నుంచి 18 వరకు నిర్వహించిన ప్రతినిధుల సభలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. మహాసభల విజయవంతానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర కమిటీ, రిసెప్షన్ కమిటీ, వలంటీర్లకు జాతీయ నాయకత్వం ప్రత్యేక అభినందనలు తెలిపింది.
ఉద్యమ బలోపేతమే లక్ష్యంగా...
నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు సాగిన ఏఐకేఎస్ 36వ మహాసభలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు వ్యవసాయ రంగ సంక్షోభంపై విస్తృతంగా చర్చించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతుల రుణభారం, పంటల కొనుగోలు, వ్యవసాయ కార్మికుల ఉపాధి, సాగునీటి సమస్యలు, కార్పొరేట్ శక్తుల పెత్తనం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రభావం వంటి అంశాలపై సుధీర్ఘంగా రాష్ట్రాల వారీగా ప్రతినిధులు చర్చకు పెట్టారు. ప్రతినిధుల సభలో సంఘం జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనీ, సంఘం స్వతంత్ర శక్తిని పెంచాలని పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రైతులు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అశోక్ ధావాలే, విజూ కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం మాటలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నవంబర్ 26న ఉత్పాదక ఖర్చులపై 50 శాతం అదనపు మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1 నుండి 3 వరకు ఢిల్లీలో సీఐటీయూ ఆధ్వర్యంలో లక్షలాది మంది కార్మికులు చేపట్టే మహా ప్రదర్శనకు ఏఐకేఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ జాతీయ మహాసభల్లో కిసాన్ సభ నూతన ఆఫీస్ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ ధావాలే, ప్రధాన కార్యదర్శిగా విజూ కృష్ణన్, ఆర్థిక కార్యదర్శిగా పుష్పేంద్ర త్యాగి ఎన్నికయ్యారు. వీరితో పాటు 12 మంది ఉపాధ్యక్షులు, 12 మంది సంయుక్త కార్యదర్శులతో కలిపి మొత్తం 27 మందితో కూడిన పటిష్టమైన ఆఫీస్ బేరర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే విధాన నిర్ణయాలు తీసుకునే సెంట్రల్ కిసాన్ కమిటీకి 86 మందిని, ఆల్ ఇండియా కిసాన్ కౌన్సిల్‌కు 167 మందిని ఎన్నుకున్నారు. ఆతిథ్య రాష్ట్రమైన తెలంగాణకు ఇందులో సముచిత ప్రాతినిధ్యం దక్కింది. కీలకమైన సీకేసీలో తెలంగాణ నుంచి తీగల సాగర్, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి చోటు దక్కించుకోగా, వీరితో పాటు వీరేపల్లి వెంకటేశ్వర్లు, బి.రాంబాబు, పి.జంగారెడ్డి, కందాల ప్రమీల (మహిళా కోటా), శోభన్ సహా మొత్తం 8 మందికి జాతీయ స్థాయిలో స్థానం లభించింది.
ఫ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తామని ప్రతినిధుల ప్రతిన
ఫ ముగిసిన ఏఐకేఎస్ జాతీయ మహాసభలు
ఫ నూతన జాతీయ కార్యవర్గం ఎన్నిక
ఫ ఆహ్వాన సంఘానికి అభినందలు తెలిపిన జాతీయ నాయకత్వం


