శాలిగౌరారం : మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఇసుక మైనింగ్ ప్రతిపాదనను రద్దు చేయాలని శాలిగౌరారం మండలం చిత్తలూరు, వంగమర్తి గ్రామాల ప్రజలు, నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిత్తలూరు, వంగమర్తి ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, పర్యావరణ అధికారి వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు నిరసన తెలిపారు. తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదించిన ఇసుక తవ్వకాలను రద్దు చేయాలని.. తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తెచ్చారు. మూసీ నదిలో ఇసుక తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు వ్యవసాయం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను మొక్కుబడిగా నిర్వహించి మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేస్తే ప్రజా ఉద్యమం చేపడతామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు శాలిగౌరారం మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం సమర్చించారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో గిరగాని వెంకన్న, సకినాల వరలక్ష్మి, కర్ణవీరయ్య, జయమ్మ, యాదగిరి, నతానియేల్, వీరభద్రం, వెంకన్న, మామిడి సర్వయ్య, కట్ట వెంకట్‌రెడ్డి, రమేష్, రవి, దాసరి దేవచిత్తం, ఎర్ర రాజు పాల్గొన్నారు.
ఫ ప్రజాభిప్రాయ సేకరణలో నాయకులు, ప్రజల డిమాండ్


