ఫ ఇన్‌చార్జిగా మిర్యాలగూడ కమిషనర్ శ్రీజారెడ్డికి అదనపు బాధ్యతలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణను బదిలీ చేస్తూ మున్సిపల్ సెక్రటరీ శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డికి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. వంశీకృష్ణను టీయూఎఫ్‌ఐసీడీకి బదిలీ చేశారు. కొద్ది నెలలకే కమిషనర్ బదిలీ కావడం నల్లగొండలో చర్చనీయాంశమైంది.
చిత్రలేఖనంతో సృజనకు పదును
రామగిరి(నల్లగొండ) : విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయడానికి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు దోహదపడతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ అన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లోనూ నిరంతరం సాధన చేస్తూ తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ విద్యార్థులకు ప్రత్యేక మోటివేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఎం.రాజేష్, లైబ్రేరియన్ ఆర్.కుసుమశ్రీ, జూనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాస్, రికార్డ్ అసిస్టెంట్ కె.సృజనరావు పాల్గొన్నారు.
మత్తు రహిత సమాజాన్ని నిర్మించాలి
నల్లగొండ : మత్తు రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి డి.లావణ్యకుమారి అన్నారు. మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ జిల్లా మహిళా ప్రాంగణంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, బాధితులను గుర్తించి వారికి తగిన కౌన్సెలింగ్, సహాయ సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మత్తుకు బానిసైన వారిని గుర్తించడం, వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైన సహాయ సేవలు అందించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో రాకేష్, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.
సాయి ఆలయంలో కలశపూజ
హాలియా : కార్తీక మాసోత్సవంలో భాగంగా బుధవారం హాలియా పట్టణంలోని షిర్డీ సాయి మందిరంలో 21వ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ పాండే ఆధ్వర్యంలో కాగడ హారతి, బాబాకు 108 కలశాలతో అభిషేకం, చందనోత్సవం, సంస్థాన్ హారతి, ధుని పూజ, సామూహిక భజన తదితర పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తేలపోలు శేఖర్, కార్యదర్శి సక్రునాయక్, కోశాధికారి మిట్టపల్లి శివకుమార్, మిల్లర్స్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, ధర్మకర్త మిట్టపల్లి సుబ్బారావు, మిట్టపల్లి వాసులు, వీరమల్ల కృష్ణయ్య, చీదళ్ల లింగయ్య, యాద ఈదయ్య, శ్రీనివాస్, రవీందర్, పాంపాటి యాదగిరి, సోమయ్య, శోభ, మనోజ్ పాండే, రమణాచార్యులు, వెంకటాచార్యులు, వినోద్ శర్మ, భీష్మాచారి పాల్గొన్నారు.


