ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
అటవీ, జలవనరులు, సాగు, వన్యప్రాణులు, పురావస్తు సంపద, 29 గ్రామాల ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావం విషయంలో తప్పుడు నివేదిక రూపొందించారని పేర్కొంటూ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20న నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని కోరారు. దీనిపై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ప్రజాభిప్రాయ సేకరణను ఎలాగైనా పూర్తి చేయాలన్న యాజమాన్యం ఒత్తిడితో గ్రామంలోకి పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న వారి ఇళ్లలోకి వెళ్లి ఆరా తీయడం, విచారణకు రావాలని బెదిరింపులకు గురిచేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సారవంతమైన వ్యవసాయ భూములు, కృష్ణానది తీరం, అటవీ ప్రాంతాల మధ్యన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అభివృద్ధి పేరుతో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమ భవిష్యత్‌లో స్థానిక ప్రజలకు పర్యావరణ సమస్యగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం రెవెన్యూ పరిధిలో 108.82 ఎకరాల్లో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న 600 కేఎల్‌డీ ఇథనాల్, 200 కేఎల్‌డీ ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లపై రూపొందించిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదికపై (ఈఐఏ) తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖపట్నంలోని ఎస్‌వీ ఎన్విరో ల్యాబ్స్ రీసర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన నివేదికలో కీలక వాస్తవాలు, పర్యావరణ ప్రభావం పూర్తిగా విస్మరించినట్లు పర్యావరణ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ పరిశ్రమ కోసం ఈనెల 20వ తేదీన పబ్లిక్ హియరింగ్ నిర్వహించబోతోంది.
అటవీ విస్తీర్ణం, టైగర్ కారిడార్‌పై
చెప్పని వాస్తవాలు
ప్రతిపాదిత పరిశ్రమకు 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అడవిదేవులపల్లి అటవీ బ్లాక్‌ను కావాలనే విస్మరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడవిదేవులపల్లి అటవీ ప్రాంతమంతా ఓవైపు అన్నమేరు వాగు, కృష్ణానది తీరం మీదుగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ వరకు విస్తరించి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌తో అనుసంధానమై ఉంది. అంతేకాదు టైగర్ రిజర్వ్‌లోని అన్నమేరు వాగులో నీటి లభ్యత పెరగడంతో చిరుతలు, జింకలు, దుప్పులు, అడవిదున్నలు, నెమళ్లు తదితర వన్యప్రాణుల సంచారం పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ అంశాలను నివేదికలో పొందుపరచలేదు. అంతేకాదు పరిశ్రమకు అవసరమైన నీటిని కృష్ణానది నుంచి తీసుకునే పైప్‌లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం అడవిలో పెరిగే మానవ, వాహన సంచార వల్ల వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం ఏర్పడనుంది.
ఎత్తిపోతలకు ఎసరు.. కుంట కనుమరుగు..
రూ.32.22 కోట్లతో 5 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చేపట్టిన ‘వీర్లపాలెం–2 ఎత్తిపోతల’ పైప్‌లైన్లు ఈ పరిశ్రమ స్థలం నుంచే వెళ్లాల్సి ఉన్నా ఈఐఏలో ఆ ప్రస్తావన లేదు. అలాగే, ఈ పరిశ్రమ నిర్మాణాలు చేపడితే వరద నీరు మళ్లింపు లేక, పశువుల దాహార్తి తీర్చే స్థానిక ‘హనుమారెడ్డి కుంట’ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
పురావస్తు సంపదకు ముప్పు..
పచ్చదనంలో కోత
కొత్తపల్లిలో గుర్తించిన 3 వేల ఏళ్ల నాటి నిర్మాణాలు, ఆలయాలు, మానవ సంచార ఆనవాళ్లపై ప్రభావ అధ్యయనం లేదు. మరోవైపు పరిశ్రమ భూమిలో 33 శాతం అంటే 35.91 ఎకరాలు గ్రీన్‌బెల్ట్‌గా ఉండాల్సి ఉండగా, 27.20 ఎకరాలే చూపించారు. అంటే 8.71 ఎకరాల లోటు ఉంది. మరోవైపు పరిశ్రమ రూ.1,500 కోట్ల టర్నోవర్ అంచనాకు అనుగుణంగా ఏటా రూ.45 లక్షలే పర్యావరణ బడ్జెట్‌గా ప్రతిపాదించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫ వాస్తవాలు దాచేసి.. పరిశ్రమకు అనుమతిచ్చేలా ఈఐఏ నివేదిక
ఫ నిబంధనలు గాలికి.. నదికి, గ్రామాలకు సమీపంలోనే ఏర్పాటు
ఫ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు
ఫ 20వ ప్రజాభిప్రాయ సేకరణ.. నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్
కాలుష్యం వచ్చే పరిశ్రమలు నది ప్రవాహాలకు 9 కిలోమీటర్లు దూరంలో, గ్రామాలకు 7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్నా దానిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపాదిత పరిశ్రమ వీర్లపాలెం, సాత్‌తండాకు 2.5 కిలోమీటర్ల దూరంలో, దుబ్బతండా, ముదిమాణిక్యంకు 3 కిలోమీటర్ల దూరంలో, తాళ్లవీరప్పగూడెంకు 4 కిలోమీటర్ల దూరంలో, అడవిదేవులపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో, ఉల్సాయిపాలెం, కాల్వకట్ట తదితర గ్రామాలు, గిరిజన తండాలు పరిశ్రమ ప్రాంతానికి సమీపంలో ఉన్నా ప్రస్తావించలేదు. కృష్ణానది కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ప్రతిపాదిత పరిశ్రమ ఉంటడం, జనావాసాల సమీపంలో పరిశ్రమ ఏర్పాటుతో గాలి, నీటి కాలుష్యం, దుర్వాసన, ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం నెలకొన్నా ఆ విషయాలేవీ పట్టించుకోలేదు.


