మిర్యాలగూడ : నాణ్యమైన వరి విత్తనోత్పత్తిపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం దామరచర్ల మండలంలోని బొల్లిగుట్టతండాలో కేఎన్‌ఎం 1638 వరి రకం విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేలైన విత్తనోత్పత్తి ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు గ్రామస్థాయిలో విత్తనాల లభ్యతను పెంచవచ్చన్నారు. సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, విత్తన శుద్ధి, ఎరువులు, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ, కోత, నిల్వ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఓ ఎన్.బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎల్‌నినో పరిస్థితులు, రానున్న నీటి ఎద్దడి దృష్ట్యా యాసంగిలో వరికి బదులు కంది, పెసర, మినుము, శనగ, నువ్వులు తదితర ఆరుతడి పంటలు సాగు చేసి వనరులను సంరక్షించుకోవాలన్నారు. నేలసారం తగ్గుతున్నందున వరి కొయ్యలను కాల్చకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఈఓ నరేష్, పీఏసీఎస్ సీఈఓ వెంకట్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


