రామగిరి (నల్లగొండ) : వరికోత మిషన్ దగ్ధమైన ఘటనలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకున్న ఫైర్ మెన్‌పై బదిలీ వేటు పడింది. ఈ ఘటనపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. వరికోత మిషన్ దగ్ధమై నష్టపోయిన రైతు నుంచి డబ్బులు వసూలు చేసిన లీడింగ్ ఫైర్ ఫైటర్ సిహెచ్. జితేందర్‌కుమార్‌ను హాలియాకు బదిలీ చేసినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి వెల్లడించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ : సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య వివరాలు వెల్లడించవద్దని కోరారు ‘ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ’ (మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండి) అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ల ద్వారా సైబర్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ‘ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించుకోండి’ అనే సూత్రాన్ని పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రమేష్, సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రైస్ మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడి రాజీనామా
నల్లగొండ : నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత అవసరాలతో పాటు ప్రస్తుతం మిల్లర్లపై జరుగుతున్న దాడులు, ఒత్తిళ్ల కారణంగా తాను ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నారు. తన పదవీకాలంలో ఎవరికై నా తన వల్ల ఇబ్బందులు కలిగితే అన్యధా భావించవద్దని కోరారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తనకు విముక్తి కల్పించి, నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అసోసియేషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి
హాలియా : నీటి సంరక్షణ కోసం రైతులు కుంటలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శేఖర్ సూచించారు. మంగళవారం ఆయన అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాల్లో బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, కాశ్మీర్ ఆపిల్ బేర్, ఆయిల్‌పామ్, మిర్చి తోటలు, నీటి కుంటలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. నీటి కుంటలకు ప్రభుత్వం 50శాతం రాయితీ కల్పిస్తుందన్నారు. మిర్చి పంట తెగుళ్ల బారిన పడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని జిగురు అట్టల ద్వారా పురుగు ఉధృతి తెలుసుకొని మందులు స్ప్రే చేయాలని సూచించారు. కార్యక్రమంలో అనుముల క్లస్టర్ ఉద్యాన అధికారి మురళి, విస్తరణ అధికారి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
12 నుంచి చేయూత పింఛన్ల పంపిణీ
నల్లగొండ : చేయూత పంఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 12 నుంచి 18 వరకు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన వివిధ అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పింఛన్ల పంపిణీలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ముందుగా ప్రజాప్రతినిధుల సమ్మతితో తేదీలను ఖరారు చేయాలని, పండుగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలో 20 పాఠశాలల్లో టాయిలెట్స్ లేవని గుర్తించామని.. ఆ పాఠశాలలో వెంటనే టాయిలెట్ పనులు ప్రారంభించి వచ్చే వారంలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, డీఈఓ సుశీందర్‌రావు పాల్గొన్నారు.


