త్వరలోనే పనులు ప్రారంభిస్తాం..
మిర్యాలగూడ : ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు మూడు ఫ్లైఓవర్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు రెండేళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి. తీరా ఇప్పుడు కేవలం ఒక్క అండర్‌పాస్ నిర్మాణానికే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం మిర్యాలగూడ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్న ఐదు బ్లాక్‌స్పాట్‌ల సమస్యకు ప్రజలు ఫ్లైఓవర్లు కోరుతుంటే, ప్రభుత్వం నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రూ.37.95 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క అండర్‌పాస్‌తో బైపాస్ రహదారిపై ఉన్న అన్ని ప్రమాదకర జంక్షన్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.
రూ.180 కోట్ల నుంచి.. రూ.38 కోట్లకు!
పట్టణ విస్తరణతో బైపాస్ రహదారి క్రమంగా జనావాసాల మధ్యకు చేరింది. ఇరువైపులా కాలనీలు, వాణిజ్య సంస్థలు విస్తరించడంతో వాహనాల రద్దీ పెరిగి రోడ్డు దాటడం ప్రాణసంకటంగా మారింది. ప్రమాదాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఏడుకోట్లతండా (వై–జంక్షన్), నందిపాడు జంక్షన్, రవీంద్రనగర్, చింతపల్లి జంక్షన్, ఈదులగూడ జంక్షన్‌లను ఐదు బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు. ఈ క్రాస్‌రోడ్ల వద్ద ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి రూ.180 కోట్లు (భూసేకరణకు రూ.30 కోట్లతో సహా) మంజూరైనట్లు గతంలో ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ, ఇటీవల రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేకాధికారి వికాస్ రాజ్.. కేవలం నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రూ.37.95 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసి కొత్త టెండర్లకు ఆదేశించారు. దీంతో మిగిలిన నాలుగు బ్లాక్‌స్పాట్ల పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.
శంకుస్థాపనల గుంతలు
కూడా పూడిపోయాయి..
మిర్యాలగూడ బైపాస్‌లో మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని రెండేళ్ల కిందట రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. శంకుస్థాపనలు కూడా చేశారు. అయితే రెండేళ్లు దాటినా పనులు ప్రారంభం కాకపోవడంతో శంకుస్థాపనల కోసం తీసిన గుంతలు సైతం పూడిపోయాయి. శంకుస్థాపన చేసిన నాటి నుంచి సుమారు 25కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలు జరగకముందే పాలకులు స్పందించి, హామీ ఇచ్చిన మూడు ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నందిపాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న అండర్‌పాస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఒక అండర్‌పాస్‌కే నిధులు మంజూరయ్యాయి. టెండర్లను ఆహ్వానించి, స్క్రూట్నీ అనంతరం పనులను మొదలుపెడతాం. ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు మంజూరైతే వై–జంక్షన్, చింతపల్లి వద్ద కూడా పనులు చేపడతాం.
– పవన్‌నాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ
ఫ మిర్యాలగూడ బైపాస్‌పై మూడు ఫ్లైఓవర్ల హామీల బుట్టదాఖలు
ఫ ఐదు బ్లాక్ స్పాట్లలో నిత్యం నెత్తురోడుతున్న రహదారి
ఫ నందిపాడు వద్ద ఒక్క అండర్‌పాస్‌కే మోక్షం!
ఫ మిగిలిన జంక్షన్ల వద్ద భద్రతపై ప్రజల్లో ఆందోళన


