గృహజ్యోతి వినియోగదారులకు ఊరటేనా?
విద్యుత్ వినియోగదారులకు బిల్లుల మోత
ఫ రెండేళ్ల బకాయిలు 29 నెలల బిల్లుల్లో రాబట్టనున్న డిస్కంలు
ఫ ప్రతి యూనిట్‌పై 30 పైసల నుంచి 50 పైసల చొప్పున అదనంగా వసూలు
ఫ అదనపు భారంతో వినియోగదారుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు విద్యుత్ బిల్లుల రూపంలో అదనపు భారం పడుతోంది. తాజాగా ట్రూ అప్ చార్జీల వసూలుకు విద్యుత్ పంపిణీ సంస్థలు శ్రీకారం చుట్టాయి. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలు, సరఫరా వ్యయాలకు సంబంధించి ఏర్పడిన వ్యత్యాసాన్ని వినియోగదారుల నుంచి రాబట్టుకునేందుకు నిర్ణయించాయి. ఇందుకోసం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.53.55 కోట్లను.. 29 నెలల పాటు విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేయనున్నాయి. ఇప్పటికే నవంబర్ నెల బిల్లుల్లో యూనిట్‌కు 30 పైసల చొప్పున అదనపు చార్జీలను జతచేసి బిల్లులు జారీ చేశారు.
29 నెలలపాటు అదనపు భారం
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రూ అప్ చార్జీలను 18 నెలల పాటు వసూలు చేయాలని నిర్ణయించారు. మొదటి నెల యూనిట్‌కు 30 పైసలు, రెండో నెల నుంచి ప్రతి యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు చేయనున్నారు. అలాగే 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో 11 నెలల పాటు ఇదే తరహాలో చార్జీలు విధించనున్నారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని కలిపి 2026 నవంబర్ నుంచి 2029 మే వరకు వినియోగదారుల నుంచి రాబట్టనున్నారు. అంటే దాదాపు రెండున్నరేళ్లపాటు ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లులో ప్రస్తుత వినియోగానికి సంబంధించిన చార్జీలతో పాటు పాత బకాయిల భారం కూడా కలవనుంది.
వినియోగించిన యూనిట్ల ఆధారంగా..
2022–23 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీలకు చెందిన 7,18,609 కనెక్షన్లు ఉండగా, 2023–24లో 6,95,333 కనెక్షన్లు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక తదితర అన్ని కేటగిరీల వినియోగదారులకూ వారు ఆయా సంవత్సరాల్లో వినియోగించిన యూనిట్ల ఆధారంగా అదనపు చార్జీలు విధించనున్నారు.
బిల్లులు తడిసి మోపెడు
ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ట్రూ అప్ చార్జీలు మరింత భారంగా మారనున్నాయి. ఇప్పటివరకు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించడమే భారంగా భావిస్తున్న సామాన్యులకు ఇప్పుడు గత రెండేళ్ల లెక్కల పేరుతో అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తే అంతకు సంబంధించిన బిల్లుతో పాటు గతంలో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన సర్దుబాటు చార్జీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇలా 29 నెలల పాటు అదనపు వసూళ్లు కొనసాగనుండటంతో ప్రతి నెలా విద్యుత్ బిల్లులు వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది.
ప్రస్తుతం జిల్లాలో ఈ సంవత్సరంలో 5,07,666 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్ 75,898, ఇండస్ట్రియల్ 4,668 కనెక్షన్లు ఉన్నాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే కనెక్షన్లు 2,52,870 ఉన్నాయి. వీరికి జీరో బిల్లు వస్తోంది. ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వారు ట్రూఆఫ్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే 2022–23, 2023–24 సంవత్సరాల్లో ప్రస్తుత గృహజ్యోతి వినియోగదారులు అప్పట్లో 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించి ఉంటే ట్రూ ఆఫ్ చార్జీలు వారు కూడా చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.


