సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

మిర్యాలగూడ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ పాలన సాగునీటి రంగాలో స్వర్ణయుగంగా నిలిచి పోతుందని తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణ సమీపంలోని తుంగపాడు వద్ద రూ.33కోట్ల వ్యయంతో నిర్మించిన 560 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్‌ ప్రారంభించారు. ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపస చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేస్తామన్నారు. దామరచర్ల మండలంలోని శాంతినగర్‌, రావులపెంట వాగులపై ఒక్కొక్కటి రూ.9కోట్ల వ్యయంతో చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్రంలో 4 లక్షలకుపైగా ఇందిరమ్మ ఇళ్లను అందించినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన 3,600 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లలో కనీసం వెయ్యి ఇళ్లను పూర్తిచేసి పేదలకు అందించాలని కలెక్టర్‌కు సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయితే గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా నీటిని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. విడతలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్‌, జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రమణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిలుకూరి సుధా, వైస్‌ చైర్‌పర్సన్‌ గుడిపాటి శిరీష, సర్పంచ్‌ గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాకు స్వర్ణయుగం తీసుకొస్తాం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తుంగపాడులో డబుల్‌బెడ్రూమ్‌ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement