అర్హుల ఎంపికకు సర్వే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పట్టణ అభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నల్లగొండ నగరంలో సొంత ఇళ్లు లేని పేదలకు వసతి కల్పించే దిశగా ఐదంతస్తుల (జీ+5) ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. నగరంలోని కతాల్‌గూడ – మామిళ్లగూడెం మధ్యలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో అపార్ట్‌మెంట్ టవర్లు నిర్మించి 480 మంది పేదలకు ఫ్లాట్లు అందించాలని నిర్ణయించారు. నల్లగొండతోపాటు నిజమాబాద్, గ్రేటర్ వరంగల్ (వరంగల్, హనుమకొండ), మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 2400 ఫ్లాట్లను రూ. 204 కోట్ల వ్యయంతో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్మించనున్నారు.
480 కుటుంబాలకు వసతి
నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ జరిగినప్పటికీ ఇంకా అనేకమంది పేదలు సొంత ఇళ్లు లేక అద్దె గృహాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని నగరంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్లు నిర్మించి 480 కుటుంబాలకు నివాస వసతి కల్పించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగనుంది.
ఐదంతస్తుల నిర్మాణానికి అనుమతి
తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రతిపాదనల మేరకు జీ+5 విధానంలో అపార్ట్‌మెంట్ బ్లాకుల నిర్మాణానికి ప్రభుత్వం సాంకేతికంగా అనుమతించింది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయాన్ని రూ.8.50 లక్షలుగా ప్రతిపాదించారు. ఈ మేరకు రవాణా, రోడ్లు భవనాల శాఖ ఈ నెల 6న జీవోఆర్‌టీ నంబర్ 579 జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన, సొంత ఇల్లు లేని పట్టణ పేదలకు అందుబాటు ధరలో నివాస సౌకర్యం కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
పేదలకు ఎంతో మేలు
నల్లగొండ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. రహదారులు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో నివాసాల అవసరం కూడా అధికమవుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి ఫలాలు పేద కుటుంబాలకు కూడా అందాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. నాలుగు టవర్ల నిర్మాణం పూర్తయితే 480 కుటుంబాలకు సొంత నివాసం అందుబాటులోకి రానుంది. అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న పేదలకు ఆర్థిక భారం తగ్గడంతోపాటు స్థిరమైన నివాసం లభించే అవకాశం ఉంటుంది.
ఫ్లాట్ల కేటాయింపునకు ముందు అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో డిమాండ్ సర్వే నిర్వహించనున్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సొంత ఇల్లు లేని కుటుంబాల వివరాలు సేకరించనున్నారు. అర్హతలు, ధ్రువీకరణ, లబ్ధిదారుల ఎంపిక, లాటరీ విధానం తదితర నిబంధనలను రూపొందించనున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.5 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అందించే అంశానికి సూత్రప్రాయ ఆమోదం లభించగా, మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల వాటాగా సమీకరించే విధానానికి కూడా అనుమతి ఇచ్చింది.
ఫ జీ+5 అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి
ఫ 480 ఫ్లాట్ల నిర్మాణం
ఫ సాకారం కానున్న పేదల సొంతింటి కల


