● రెండు నెలలుగా మట్టి తవ్వకాలు
● నోటీసులు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ పరిధిలోని ఏళ్ల నాటి రాగి కుంట అన్యాక్రాంతమవుతోంది. రెండు నెలలుగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే జేసీబీలతో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కుంట మట్టిని సొంతానికి, వ్యాపార అవసరాలకు వాడుకుంటూ రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ సంపదను పక్కదారి పట్టిస్తున్నారు.
ఎఫ్‌టీఎల్ ఆక్రమణ.. ప్రజలకు దారి బంద్..
సర్వే నంబర్ 46, 47లో 5 ఎకరాల 38 గుంటల విస్తీర్ణంలో ఉన్న రాగి కుంట పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ ప్రాంతాలు ఆక్రమణల్లో చిక్కుకున్నాయి. చెరువు చుట్టూ భూములను కబ్జా చేయడమే కాకుండా, కుంటలోకి గ్రామస్తులు వెళ్లకుండా ఇరువైపులా పెద్ద గేట్లు ఏర్పాటు చేసి తాళాలు వేసి దారి లేకుండా మూసివేశారు. ఆక్రమణలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ అధికారుల నోటీసులు..
కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు, కబ్జాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మట్టి తవ్వకాలు జరిపిన వారికి నోటీసులు జారీ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రాగి కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ హద్దులను త్వరలోనే సర్వే చేసి, ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
నీటి మార్గం మూసివేత..
ఎగువన ఉన్న నరసప్పగూడెం చెరువు నుంచి, వర్షం ద్వారా రాగికుంటలోకి సహజంగా నీరు వచ్చి చేరుతుంది. కుంటలో నీరు ఉంటే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగి, దాదాపు 100 ఎకరాల వరకు పంట పొలాలకు సాగునీరు అందుతుంది. కానీ నీరు వచ్చే మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో కుంట ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.


