జీపీఎస్ విధానంతో సర్వే..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో భువన్ సర్వే వేగం పుంజుకుంది. నగరంలోని భవనాలు మార్పులు, చేర్పులు జరిగాయా లేదా అనే వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లకోసారి భువన్‌సర్వే చేపడుతుంది. నీలగిరి నగరంలో 26 వేల భవనాలకు భువన్ సర్వే చేపట్టాలని కొన్ని నెలల క్రితమే సీడీఎంఏ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వార్డు ఆఫీసర్లకు వివిధ పనుల కారణంగా ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న భువన్‌సర్వే సీడీఎంఏ ఆదేశాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు పరుగులు పెడుతున్నారు. వారం పది రోజుల్లో మెజార్టీ భవనాల భువన్ సర్వే పూర్తి చేయాలని సీడీఎంఏ దిశా నిర్ధేశం చేయడంతో ప్రతి డివిజన్‌లో ముగ్గురు ఉద్యోగులతో భువన్ సర్వే చేపడుతున్నారు. మొత్తంగా నవంబర్‌లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
చిన్న దుకాణాలు భారీ
వాణిజ్య భవనాలుగా మార్పు..
నగరంలో నాలుగైదేళ్ల నుంచి భారీ స్థాయిలో మార్పులు చేర్పులు వచ్చిన విషయం తెలిసిందే. చిన్న, చిన్న దుకాణాల స్థానంలో భారీ షాపింగ్ మాల్స్, కొత్త కాలనీల్లో ఇంటి నిర్మాణాలు ఉన్న స్థానంలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు వందల సంఖ్యలో వెలిశాయి. ఇలాంటి వాటిని గుర్తించి కొలతలు వేసి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నగరంలోని హైదరాబాద్ రోడ్, డీవీకే రోడ్, బొట్టుగూడ, డాక్టర్స్ కాలనీ, విద్యానగర్, సాగర్ రోడ్ తదితర ప్రాంతాల్లో అనేక మంది వాణిజ్య భవనాలు, షాపింగ్ మాల్స్ నిర్మాణాలు చేపట్టడంతో పాత ఆస్తి పన్ను మాత్రమే వస్తుందని తెలుస్తోంది. ఇలాంటి వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను మదింపు చేపట్టాల్సి ఉంటుంది. కొందరు ఒక అంతస్తు తీసుకొని ఆ తరువాత మూడు, నాలుగు అంతస్తుల నిర్మాణాలు సైతం చేపట్టారు. ఇలాంటి ప్రాంతాల్లో ఆస్తి పన్ను ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.
భువన్ సర్వే పెండింగ్‌లో ఉండడంతో సీడీఎంఏ ఆదేశాల మేరకు మూడు రోజుల నుంచి అన్ని డివిజన్లలో సర్వే చేయిస్తున్నాం. వారం, పది రోజుల్లో ఎన్ని భవనాలు పూర్తవుతాయో ఒక అంచనా వస్తుంది. నెల రోజుల్లోగా సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– బి.వంశీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
నీలగిరి నగరంలో మొత్తం 44 వేలకు పైగానే భవనాలు ఉన్నాయి. వీటిలోని 26 వేల భవనాలను సీడీఎంఏ అధికారులు ఎంపిక చేసిన జాబితాను పంపించారు. ఈ జాబితాల్లోని భవనాలను పరిశీలించి కొలతలు వేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని నిర్మాణం తరువాత మరో అంతస్తు వేయడం, లేదా వాణిజ్య భవనంగా మార్చడం తదితర వాటిని గుర్తించి మార్పులు, చేర్పులకు అనుగుణంగా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా సర్వే చేయనున్నారు. ఈ విధానంతో ఇంటికి సంబంధించిన వివరాలను పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సర్వేలో భాగంగా ఇంటి నంబర్, నల్లా నంబర్, ఇంటి యజమాని సెల్ నెంబర్ తదితర వివరాలను సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫ నగరంలో 26వేల భవనాలను ఎంపిక చేసిన సీడీఎంఏ
ఫ నెల రోజుల్లో సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక


