నల్లగొండ అగ్రికల్చర్ : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీపి కబురు అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 24వ విడత పెట్టుబడి సాయం నిధులను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలోని 1,08,861 మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో విడతల వారీగా ఈ నగదు పూర్తిగా రైతుల ఖాతాల్లోకి చేరనుంది. పథకం ప్రారంభమైన 2018లో జిల్లా వ్యాప్తంగా 2,78,667 మంది రైతులు అర్హులుగా ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1,08,861కి పరిమితమైంది. కొన్నేళ్లుగా మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించడం, భూములు అమ్ముకున్న వారిని పక్కన పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను అర్హుల జాబితా నుంచి మినహాయిస్తున్నారు. కానీ సరికొత్తగా అర్హత సాధించిన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదు. దీంతో ప్రతి విడతకూ జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య క్షీణిస్తూ వస్తోంది.


