వేసవికి ముందే గ్రామాల్లో ప్ర‘జల’ గోస
ఎల్‌నినో
ఎఫెక్ట్..
సాక్షి ప్రతినిధి నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో వేసవి రాకముందే జిల్లాలోని చాలా గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు ఎండిపోవడం, మిషన్ భగీరథ నీరు సరిపడా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా.. మరికొన్ని చోట్ల పాత బోర్లకు మరమ్మతులు చేసి, రైతుల నుంచి బోర్లను అద్దెకు తీసుకుంటున్నారు. కొత్తగా బోర్లు వేయించినా నీరుపడని పరిస్థితులూ ఉన్నాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రోజుకు 21.80 ఎంఎల్‌డీల వ్యత్యాసం
జిల్లాలోని 33 మండలాల పరిధిలో 869 గ్రామ పంచాయతీలు, 1,774 ఆవాసాలు ఉన్నాయి. 2026 జనాభా అంచనాల ప్రకారం 14,41,256 మంది నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల చొప్పున లెక్కిస్తే 144.12 ఎంఎల్‌డీల (మిలియన్ లీటర్స్ ఫర్ డ) నీరు అవసరం. అయితే ప్రస్తుతం 122.32 ఎంఎల్‌డీల సరఫరా మాత్రమే నమోదైంది. ఈ లెక్కల ప్రకారం రోజుకు 21.80 ఎంఎల్‌డీల తక్కువగా నీటి సరఫరా అవుతున్నట్లు వెల్లడైంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి వనరుల్లో లభ్యత తగ్గితే ఈ అంతరం మరింత సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే మండలాలు, గ్రామాల వారీగా నీటి అవసరాలు, సరఫరా సామర్థ్యం, ప్రత్యామ్నాయ వనరుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
పాత బోర్లకు మరమ్మతులు
నల్లగొండ మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. మెజారిటీ గ్రామాల్లో బోర్లు సరిగ్గా పోయడం లేదు. దీంతో కొన్ని చోట్ల గతంలో వాడి వదిలేసిన బోర్లను మళ్లీ మరమ్మతులు చేస్తున్నారు. జి.చెన్నారంతోపాటు అప్పాజీపేట గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు పాత బోరుబావిలో కొత్త మోటారును బిగించి వాడుకుంటున్నారు.
లోతుకు వేసినా.. నీరు పడలే!
మునుగోడు మండలంలోని గూడపూర్‌లో గతంలో ఏర్పాటు చేసిన ఐదు బోర్లలో నాలుగు ఎండిపోయాయి. దీంతో మరింత లోతుకు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఒక బోరు, మిషన్ భగీరథ నీటి సరఫరాపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరిపడా రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు.
భూగర్భ జలాలు పడిపోవడంతో గ్రామ పంచాయతీ బోర్లలో నీరు చాలా తక్కువగా వస్తున్నాయి. దీంతో రెండు అద్దె బోర్లు తీసుకొని నీటి సరఫరా చేస్తున్నాం. అయినా గ్రామంలోని ప్రజలకు నీరు సరిపోవడం లేదు. దీంతో వారంలో ఒకటి, రెండు రోజులు అద్దెకు ట్యాంకర్లు తీసుకొచ్చి వాటిలో నీటి నింపి ఇంటింటికీ పంపి పోయిస్తున్నాం.
– పోలగొని విజయలక్ష్మి, సర్పంచ్, ఊకొండి, మునుగోడు మండలం
మా గ్రామంలో తాగునీటికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోర్లు సరిగా పనిచేయకపోవడంతో ట్యాంకర్లకు కూడా నీరు సమకూర్చడం కష్టమవుతోందన్నారు. అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. లేదంటే మూగజీవాలను కూడా కాపాడుకోవడం కష్టమవుతుంది.
– పోలేని యుగంధర్, పోచంపల్లి వార్డు సభ్యుడు, గుర్రంపోడు మండలం
ఫ అడుగంటుతున్న భూగర్భ జలాలు
ఫ ఎండిపోతున్న బోర్లు, బావులు
ఫ కొన్ని గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా
ఫ మరికొన్ని చోట్ల అద్దె బోర్లే దిక్కు
ఫ పాత బోర్లకు మరమ్మతులు చేయిస్తున్న సిబ్బంది
ఇవీ నల్లగొండ మండలం జి.చెన్నారం చెరువులో 20 ఏళ్ల కిందట తాగునీటి వ్యవస్థ కోసం వేసిన ఒక పాత బోరును తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు చేపట్టిన పనుల దృశ్యాలు. ఆ బోరును గడిచిన ఐదేళ్లలో ఎవరూ వినియోగించలేదు. ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతుండటంతో పాత బోరులో కొత్త మోటార్‌తో పాటు పైపులను బిగించారు. అంతేకాదు గ్రామంలోకి పైపులైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు
ఇదీ గుర్రంపోడు మండలం పోచంపల్లి ట్యాంకర్ ద్వారా తాగునీటిని అందిస్తున్న దృశ్యం. ఈ గ్రామం మిషన్ భగీరథ చివరి పాయింట్ కావడంతో సరిపడా నీరు రావడం లేదు. మరోవైపు భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు సరిగ్గా పోయడం లేదు. దీంతో గ్రామంలో ప్రజలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.


