మత్స్యబీజ క్షేత్రం.. నెరవేరని లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మత్స్యబీజ క్షేత్రం.. నెరవేరని లక్ష్యం

Oct 30 2026 2:21 AM | Updated on Oct 30 2026 2:21 AM

పాములతో బెంబేలెత్తుతున్నాం..

నిధుల లేమితోనే సమస్య

నిడమనూరు : మత్స్య సంపదను పెంచి మత్స్యకారులకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వ మత్స్యబీజ క్షేత్రం అధికారుల నిర్లక్ష్యంతో అడవిలా మారింది. చేప పిల్లలను ఉత్పత్తి చేసి వివిధ చెరువులకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో 1990లో నిడమనూరు మండలంలోని ఇండ్లకోటయ్యగూడెం వద్ద సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును మత్స్యబీజ క్షేత్రంగా అభివృద్ధి చేశారు. ఇందులో కార్యాలయ భవనంతో పాటు, సిబ్బంది కోసం క్వార్టర్లు, చేపలు పెంచేందుకు 50కి పైగా నీటి తొట్లను నిర్మించారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఇవన్నీ శిథిలావస్థకు చేరాయి. చెరువంతా ముళ్ల పొదలతో దట్టమైన అడవిలా మారిపోయింది.

ప్రైవేటుకే ప్రాధాన్యం

కోట్లాది రూపాయల విలువైన సొంత మత్స్యబీజ క్షేత్రం అందుబాటులో ఉన్నప్పటికీ.. నిధులు లేవన్న సాకుతో అధికారులు ఇక్కడ చేప పిల్లల పెంపకాన్ని గాలికొదిలేశారు. ప్రతియేటా ప్రైవేట్‌ కంపెనీలు, వ్యక్తుల నుంచి టెండర్ల ద్వారా చేప పిల్లలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తుండటం గమనార్హం. చెరువును బాగుచేసి ఇక్కడే చేపల పెంపకం చేపడితే మత్స్యకారులకు ఉపాధి దొరకడంతో పాటు, పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని స్థానికులు చెబుతున్నారు.

ప్రాణ భయంలో స్థానికులు

మత్స్యబీజ క్షేత్రం అడవిలా మారడంతో సాయంత్రం కాగానే చెరువులో నుంచి పాములు, ఇతర విష పురుగులు సమీపంలోని ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చెరువును శుభ్రం చేయించి, కట్టను బలోపేతం చేసి మళ్లీ చేప పిల్లల పెంపకానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఫ అడవిని తలపిస్తున్న ఇండ్లకోటయ్యగూడెం చేపల చెరువు

ఫ పట్టింపులేక పాడవుతున్న క్వార్టర్లు, నీటి తొట్లు

ఫ ప్రైవేటు వ్యక్తుల నుంచే

చేప పిల్లల కొనుగోలు

చెరువులో చేపల పెంపకం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా చిట్టడవిలా మారింది. ఎటు చూసినా పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు పెరిగిపోయాయి. దీంతో పాములు, విష పురుగులు, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి ఇళ్లలోకి వస్తుండటంతో భయాందోళనలకు

గురవుతున్నాం.

పోకల కృష్ణయ్య, సర్పంచ్‌, ఇండ్లకోటయ్యగూడెం

నిధులు లేకపోవడం వల్లనే చెరువులో పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపట్టలేకపోతున్నాం. ఏడాదిలో కేవలం ఒకటి, రెండు నెలలు మాత్రమే ఇక్కడ చేప పిల్లల పెంపకం చేపడుతున్నాం. చెరువు దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

– నవీన్‌కుమార్‌, చేపపిల్లల

పెంపకం పర్యవేక్షణ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement