గుర్రంపోడు : వర్షాభావ పరిస్థితుల్లోనూ ఏఎమ్మార్పీ జలాలతో కళకళాడాల్సిన ఆయకట్టు చెరువులు నేడు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఒకవైపు పంటలు ఎండిపోయి అల్లాడుతున్న రైతులు.. మరోవైపు చెరువుల్లో చుక్కనీరు లేక కరువును అధిగమించేదెలా అని ఆందోళనకు గురవుతున్నారు. గతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నాగార్జునాసాగర్ ప్రాజెక్టులో నీరుండి ఆయకట్టులో సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయేది. ఆయకట్టులో చెరువులు, కుంటలు నింపేందుకు కూడా నీటి విడుదల లేకపోవడంతో తలాపున నీరున్నా తమ చెరువులు వట్టిపోయి ఉంటడంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎలాగైనా చెరువులు నింపేలా గేట్లు ఎత్తాలని అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. గేట్లు తెరవద్దని ఆదేశాలు ఉన్నందున అధికారుల కళ్లుగప్పి రైతులు రాత్రివేళ గేట్లు ఎత్తి చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నా అధికారులు ఉదయం పూట వచ్చి వెంటనే గేట్లను కిందకు దించుతున్నారు.
చెరువులకు ప్రత్యేక కాల్వలు లేక పాట్లు
గతంలో ఏఎమ్మార్పీ ఆయకట్టుకు సాగునీరు కొరకు కాల్వలు తవ్వారు. ఈ కాల్వలు చెరువులకు అనుసంధానం చేసేలా లేకపోవడంతో పొలాలు పారుకుంటూనే నీరు చేరాల్సి వస్తుంది. మండలంలో ఐదు వందల ఎకరాల చొప్పున ఆయకట్టు కలిగిన చేపూరు, మొసంగి చెరువులతోపాటు ఇతర కుంటల్లోకి నీరు చేరడం లేదు. గతంలో ఈ చెరువులు నింపేలా ప్రత్యేక కాల్వలకు భూసేకరణ జరిపాలనే ప్రయత్నం జరిగినా నిధుల మంజూరుకు నోచుకోలేదు. ఏఎమ్మార్పీకి నీటి విడుదల జరిగిన మొదట్లో ఆయకట్టుకు కాకుండా కేవలం చెరువులు నింపేందుకు నీరు వదిలేవారు. ఇప్పుడు కూడా చెరువులు నింపేందుకు ప్రాధాన్యం ఇచ్చి డిస్ట్రిబ్యూటరీల వారీగా నీటిని విడుదల చేయాలని, ప్రస్తుతం వరికోతలు జరుగుతున్నందున పంట పొలాలకు నీరు మళ్లించుకోవడం జరగదని రైతులు అంటున్నారు. చెరువులు నింపేందుకు ఇదే అనువైన సమయం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చెరువులు నింపేలా చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
ఏఎమ్మార్పీ డివిజన్
ఈఈ ఏమంటున్నారంటే..
ఈ విషయమై ఏఎమ్మార్పీ డివిజన్ ఈఈ నెహ్రూనాయక్‌ను వివరణ కోరగా చెరువులు నింపేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. ఆయకట్టులో ఈ యాసంగిలో వరిసాగు చేయవద్దని సూచించారు.
చెరువులు నింపాలని ప్రజావాణిలో అధికారిని కోరుతున్న రైతులు (ఫైల్)
వట్టిపోయి చుక్కనీరు లేని ఆయకట్టులోని కొప్పోలు తాటి చెరువు
గ్రామాల దరిచేరని ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ నీరు
ఫ ‘గుర్రంపోడు’లో వట్టిపోతున్న చెరువులు, కుంటలు
ఫ అప్పుడే మొదలైన తాగునీటి ఎద్దడి
ఫ చెరువులు నింపాలని రైతుల వేడుకోలు


