కాటమయ్య కిట్లపై అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

కాటమయ్య కిట్లపై అనాసక్తి

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

శిక్షణపై ఆసక్తి చూపని లబ్ధిదారులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి ప్రాణాలు కోల్పోతున్న గీత కార్మికుల కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలాంటి ప్రమాదాలను నివారించి గీత కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కిట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకం అమలులో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు. కిట్ల పంపిణీకి నాయకులు సమయం కేటాయించకపోవడం, వాటిని పొందేందుకు అవసరమైన శిక్షణకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాకు 7,215 కిట్లు రాగా.. ఇప్పటివరకు పంపిణీ చేసింది 3,167 మాత్రమే. మిగిలిన లబ్ధిదారుల్లోనూ అందరికీ శిక్షణ ఇవ్వలేదు.

ప్రమాదాల నివారణకు రక్షణ కిట్లు

గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడకుండా కాటమయ్య రక్షణ కిట్‌ ఉపయోగపడుతుంది. కిట్‌కు అనుసంధానించిన తాడు చెట్టును గట్టిగా పట్టుకునేలా రూపొందించారు. కార్మికుడు ప్రమాదవశాత్తు జారినప్పుడు తాడు ఆధారంగా చెట్టుకు వేలాడుతూ ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. దీంతో కిందపడే ప్రమాదాన్ని తగ్గించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న కిట్లను అర్హులైన గీత కార్మికులందరికీ అందించడంతోపాటు, వాటి వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంది.

సగం కూడా దాటని పంపిణీ

గీత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం జిల్లాకు మొత్తం 7,215 కాటమయ్య రక్షణ కిట్లను కేటాయించింది. వీటిలో ఇప్పటివరకు 3,167 కిట్లను మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన 4,048 కిట్లు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. వచ్చిన కిట్లలో సగం కూడా పంపిణీ చేయలేదు. కిట్ల పంపిణీకి నాయకులు, ప్రజాప్రతినిధులు సమయం కేటాయించకపోవడం కూడా జాప్యానికి కారణమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రమాదాల నుంచి గీత కార్మికులకు రక్షణ కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు.

లక్ష్యం నెరవేరేనా?

కాటమయ్య కిట్ల పంపిణీలో జాప్యం ఆందోళన కలిగిస్తోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క కిట్టు కూడా అందజేయలేదు. అక్కడ శిక్షణ పొందిన 870 మంది కిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి మిగిలిన కిట్లను పంపిణీ చేయడంతోపాటు, శిక్షణ పొందని లబ్ధిదారులకు త్వరితగతిన శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే పథకం లక్ష్యం నెరవేరి గీత కార్మికులకు భద్రత చేకూరే అవకాశం ఉంటుంది.

ఫ జిల్లాకు వచ్చిన మొత్తం కిట్లు 7,215

ఫ లబ్ధిదారులకు అందించింది 3,167

ఫ శిక్షణకు ముందుకురాని 2,549 మంది గౌడన్నలు

ఫ పంపిణీ చేసేందుకు సమయమివ్వని నేతలు

ఫ మిర్యాలగూడలో ఒక్కరికి కూడా అందని కిట్టు

కాటమయ్య కిట్లను వినియోగించాలంటే వాటిపై అవగాహన, శిక్షణ అవసరం. తాటి చెట్టు ఎక్కే సమయంలో కిట్‌ను ఎలా ధరించాలి? ప్రమాదవశాత్తు కాలు జారితే అది ఎలా రక్షణ కల్పిస్తుంది? వంటి అంశాలపై లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే శిక్షణ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. కిట్లు అందాల్సిన మిగిలిన 4,048 మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 1,499 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఇంకా 2,549 మందికి శిక్షణ నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ శిక్షణకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడం పథకం అమలుకు అడ్డంకిగా మారుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement