నిడమనూరు : మండల కేంద్రం పరిధిలోని కోటమైసమ్మ దేవస్థానంలో తలనీలాల సేకరణ వేలాన్ని అధికారులు ఇష్టానుసారంగా నిర్వహించి అనుకున్న వారికే ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది పాటు తలనీలాలు సేకరించేందుకు బుధవారం కోటమైసమ్మ ఆలయ ప్రాంగణంలో బహిరంగా వేలం, టెండరు విధానంలో సీల్డు టెండర్లు స్వీకరించారు. సరైన ప్రచారం లేకపోవడంతో వేలానికి ముగ్గురే హాజరయ్యారు. గతంలో 10 నుంచి 20మందికిపైగా వ్యక్తులు, అలంకరణ సంస్థలు పాల్గొనేవి. గతంలో రూ.10 లక్షలు పలికిన వేలానికి బుధవారం ముగ్గురు హాజరుకాగా వి.మల్లికార్జున్ రూ.6.5 లక్షలకు పాడారు. గతంలో పలికిన రూ.10 లక్షలకు పదిశాతం ఎక్కువగా ఉంటేనే వేలం అంగీకరమవుతుందని, లేకపోతే టెండరు రద్దవుతుందని చెప్పారు. సీల్డు టెండరు విధానంలో మల్లికార్జున్ రూ.4,11,116గా అఽత్యధికంగా టెండరు వేశారు. రెండింటిలోనూ మల్లికార్జున్ అత్యధికంగా కోట్ చేశారు. బహిరంగా వేలం విధానం ఉన్నతాధికారులకు వివరించి నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు. దేవాదాయ ఫౌండర్ చైర్మన్ చెవిటి ఆంజనేయులు, ఆలయ ఈఓ బి జ్యోతి మధ్యాహ్నం తర్వాత ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేసి, రూ.లక్ష అధికం చేసి రూ.7.5 లక్షలకు మల్లికార్జున్‌కు తలనీలాల హక్కులు ఏడాదిపాటు కలిస్తున్నామని ప్రకటించడం విశేషం. అదేవిధంగా ఇటీవల రెండు నెలలు సేకరించిన తలనీలాలకు వేలం నిర్వహించగా కిలో రూ.7,300లు పలకగా, 9.3 కేజీలకు రూ.69,300 వచ్చినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ సీహెచ్ ఆంజనేయులు, విఠల్, ఉద్యోగులు శ్రీను, కోటయ్య, వెంకయ్య పాల్గొన్నారు.
ఈఓ వివరణ : ఏటా 10 శాతం వేలం పెంచేలా చర్యలు తీసుకొంటున్నామని ఈఓ జ్యోతి తెలిపారు. ప్రస్తుత మార్కెట్ డిమాండ్, గతేడాది వేలం పాడిన వ్యక్తి రూ.5 లక్షలు చెల్లించి కొంతకాలానికి విరమించుకున్నారని, దీంతో వేలంలో పాల్గొన్న వారితో చర్చించి ఖరారు చేశామని పేర్కొన్నారు.
ఫ శ్రీకోటమైసమ్మ ఆలయ టెండర్లపై ప్రచారం లేక ముగ్గురే హాజరు


