ఒక ఇంటికి రెండు నెంబర్లు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పొరపాటున ఇచ్చారా.. మరేదైనా కారణం ఉందా అనే వివరాలు పరిశీలిస్తాం. ఈ సమస్యపై పాలకవర్గం తీర్మానం చేసిన తరువాత ఒక నంబర్ తొలగించాల్సి ఉంటుంది.
– వంశీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో గతంలో కొందరు ఉద్యోగులు చేసిన తప్పుకు నగర ప్రజలు ట్రబుల్ పడాల్సి వస్తోంది. నగరంలోని కొన్ని కాలనీల్లో అప్పటి మున్సిపల్, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది ఒకే ఇంటికి రెండు నంబర్లు ఇవ్వడంతో యజమానులు నానా తంటాలు పడుతున్నారు. ఇల్లు క్రయ, విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఒక ఇంటి నంబర్ అలాటు చేశారు. ఇది తెలియని వారు చాలా మంది మున్సిపల్ కార్యాలయం నుంచి మరో ఇంటి నంబరు తీసుకున్నారు. ఇలా ఒకే ఇంటికి రెండు నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. చాలా మందికి తమ ఇంటికి రెండు ఇంటి నంబర్లు ఉన్నట్లు కూడా తెలియదు. తాజాగా పంచుతున్న ఆస్తి పన్ను బకాయి నోటీసులతో ఇలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఒకే ఇంటికి రెండు ఆస్తి పన్నులు..
నగరంలోని పలు డివిజన్లలో గతంలో జరిగిన తప్పుకు ఇప్పుడు భవన యాజమానులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. ఒకే ఇంటికి ఇచ్చిన రెండు నంబర్ల మీద రెండు ఆస్తి పన్నులు వస్తున్నట్లు తెలిసింది. గొల్లగూడ, పెద్దబండ, శాంతినగర్, బీటీఎస్, చైతన్యనగర్, చైతన్యపురి, పాతబస్తీ ఏరియా, శ్రీనగర్ కాలనీ, సావర్కర్‌నగర్, గాంధీనగర్, డీవీకే రోడ్, హైదరాబాద్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఇలా రెండు నంబర్లు ఉన్న భవనాలు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది.
పన్ను తప్పించుకోవడానికి మరికొందరు..
కొందరు మాత్రం ఆస్తి పన్ను చెల్లించకుండా ఎగమానం పెట్టడానికి ఎత్తుకు పైఎత్తులు వేశారు. కానీ అలాంటి ఎత్తుగడలు రివర్స్ అయి రెండు ఇంటి నంబర్లకు వస్తున్న ఆస్తి పన్ను చూసి షాక్ తింటున్నారు. ఆస్తి పన్ను ఎక్కువ ఉన్న భవనాలకు పన్ను ఎగొట్టేందుకు ఐదారేళ్ల కిందటి వరకు కొందరు భవన యాజమానులు మున్సిపల్ సిబ్బందిని మచ్చిక చేసుకుని మరో ఇంటి నంబర్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి మున్సిపల్ సిబ్బంది అక్రమంగా మరో ఇంటి నంబర్ ఇచ్చి మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టారు. ప్రకాశం బజారులో పాత కలెక్టరేట్ రోడ్‌లో ఓ కార్పొరేట్ మాల్‌కు ఒక ఇంటి నంబర్ మీద ఆస్తి పన్ను రూ.లక్షల్లో ఉందని, ఏడెనెమిదేళ్ల కిందట ఒక బిల్ కలెక్టర్ బై నంబర్ వేసి మరో కొత్త ఇంటి నంబర్ వేశారు. ఇది వెలుగు చూసినా ఆ నంబర్‌ను రద్దు చేయకుండా మమ అనిపించిన విషయం తెలిసిందే. ఇలా కొందరు సిబ్బంది చేతి వాటానికి పాల్పడి ఇష్టానుసారంగా తప్పిదాలు చేసి డబుల్ నంబర్లకు కారకులయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫ నీలగిరి నగరంలో కొన్ని ఇళ్లకు రెండు నంబర్లు
ఫ రెండు నంబర్లకు వస్తున్న ఆస్తి పన్ను
ఫ ఏ నంబర్‌పై పన్ను చెల్లించాలని యజమానుల తర్జనభర్జన
ఫ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని అధికారులు
ఈ ఫొటోలోని వ్యక్తి నల్లగొండ నగరానికి చెందిన బొడ్డుపల్లి సైదులు. నగరంలోని ఇతని ఇంటికి రెండు నంబర్లు ఉన్నాయి. ఆ ఇంటికి అప్పటికే మున్సిపాలిటీ నంబర్ ఉన్నా.. ఆయన కొనుగోలు చేశాక.. రిజిస్ట్రేషన్ సమయంలో మరో
నంబర్ ఇచ్చారు. ఆ నంబర్‌పైనే పన్ను చెల్లిస్తున్నాడు. మూడేళ్ల క్రితం సైదులు ఇంటికి రెండు నంబర్లు ఉన్నట్లు తెలిసింది. అప్పటి నుంచి మున్సిపల్
కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. దరఖాస్తులు పెట్టాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఒకే ఇంటికి రెండు పన్నులు వస్తున్నాయి. ఏ నంబర్ పైన పన్ను చెల్లించాలో కూడా అధికారులు తెలియజేయడం లేదు. దీంతో సైదులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.


