భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్‌

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

నల్లగొండ : సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో.. ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ ప్రక్రియపై సమీక్షించి మాట్లాడారు. 2026 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మంజూరైన భూసేకరణ నిధులను లబ్ధిదారులకు చెల్లించిన అనంతరం సంబంధిత భూముల రికార్డులో నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. సేకరించిన భూముల్లో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతోపాటు, ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ నిధులు సద్వినియోగం అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్‌ థియాన్‌ మావి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు

నల్లగొండ టౌన్‌ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఎన్‌ఎంహెచ్‌ ఉద్యోగులు ఉద్యోగులు మంగళవారం 15వ రోజు మఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు పంపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో పనిచేస్తున్న తాము ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు కేడర్‌ ఫిక్సేషన్‌ చేసి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, హెల్త్‌ కార్డులు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏడాదికి 35 క్యాజువల్‌ సెలవులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఉపేందర్‌, డాక్టర్లు ప్రియాంక, రాంబాబు, దయానంద్‌, రమేష్‌, అనిల్‌, సంతోష్‌, డాక్టర్‌ వెంకటేశం, సురేష్‌, మౌనిక, శ్రీనివాస్‌, సైదయ్య తదితరులు పాల్గొన్నారు.

నేడు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ రాక

నల్లగొండ : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ బుధవారం నల్లగొండకు రానున్నట్లు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయము 10.15 గంటలకు ఆయన నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారని తెలిపారు. స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులను సందర్శించి తర్వాత హైదరాబాద్‌ వెళ్తారని తెలిపారు.

రైతుకూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

నల్లగొండ టౌన్‌ : కరుపు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలను ఆదుకోవాలని అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, గజ్జి రవి, వేముల శంకర్‌, సిలువేరు జానయ్య, బీరెడ్డి సత్తిరెడ్డి, బూరుగు సత్తయ్య, అంబటి నర్సయ్య, కల్లూరి అయోధ్య, ఏనుగు సత్తిరెడ్డి, పజ్జూరు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ మహిళా జట్టు ఎంపిక

పెద్దవూర : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే నల్లగొండ జిల్లా సీనియర్‌ మహిళా జట్టును కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.భూలోకరావు, కార్యదర్శి జి.కర్తయ్య మంగళవారం ప్రకటించారు. ఆయేషా, అఫిష (అలీనగర్‌), నందిని (మల్లేపల్లి), హన్సిక (తిరుమలగిరి), అభినయశ్రీ (కట్టంగూర్‌), వర్షిణి (కేతేపల్లి), సంతోష్‌, జోష్న (నల్లగొండ), లక్ష్మి (పెద్దమునిగాల), ఏ.స్వరూప (మిర్యాలగూడ), శ్రీవెన్నెల (అనుముల), శ్రీచందన (భట్టుగూడెం), శ్వేత (నకిరేకల్‌), సహజ (హాలియా) ఎంపికయ్యాని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొననుందని.. ఈ జట్టుకు కోచ్‌గా ఓ.అన్వర్‌ఖాన్‌, మేనేజర్‌గా పీఈటీ రజిత వ్యవహరించనున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement