కరువు విలయం | - | Sakshi
Sakshi News home page

కరువు విలయం

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

ధాన్యాగారం నుంచి కరువు వైపు..

ఉమ్మడి జిల్లాలోని 68 మండలాల్లో కరువు పరిస్థితులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు వ్యవసాయానికి కీలక ప్రాంతంగా ఉండేది. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ, మూసీ, ఎస్‌ఎల్‌బీసీ, ఇతర సాగునీటి వనరులు వ్యవసాయానికి అండగా నిలిచాయి. వరి, పత్తి, పప్పు ధాన్యాలు, బత్తాయి వంటి పంటలు రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేవారు. మొన్నటి వరకు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. ఎల్‌నినోతో ప్రాజెక్టులు నిండక కాల్వలకు నీరవ్వలేదు. వర్షాలపై ఆధారపడిన ప్రాంతాల్లో వానలు సకాలంలో కురవకపోవడంతో పంటలకు అవసరమైన నీరు అందకపోవడం రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించడం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాను కరువు కమ్మేసింది. 73 మండలాలకు గాను ఐదు మినహా 68 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. ఎల్‌నినోతో వర్షాభావ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాలు పడిపోవడం, సాగునీటి కొరత, భారీగా పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం మంగళవారం కరువు మండలాలను ప్రకటించింది. నల్లగొండ జిల్లాలో 33 మండలాలకుగాను 28 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించింది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 23 మండలాలను, యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ అన్ని (17) మండలాలు కరువు జాబితాలో చేర్చింది.

ఆర్థిక సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి

కరువు పరిస్థితుల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ కింద సహాయాన్ని మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంట నష్టం, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, భూగర్భజలాలు, జలాశయాల పునరుద్ధరణకు మద్దతు అందించాలని కోరింది. వీబీ జీ రామ్‌జీ కింద 50 అదనపు రోజుల పని (పూర్తి ఖర్చును కేంద్రం భరించాలి), ఎరువులు, 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్‌, రూ.20,000 కోట్ల ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ అందించాలని కోరింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు సహాయం అందించాలని కూడా కోరింది.

సహాయక చర్యలపై కలెక్టర్లకు ఆదేశాలు..

కలెక్టర్లు తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందించాలని, తాగునీటి సరఫరాను పెంచాలని పేర్కొంది. అవసరమైన చోట పశుగ్రాసం ఏర్పాట్లతోపాటు పశువుల శిబిరాలు నిర్వహించాలని పేర్కొంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు వ్యవసాయ రుణాల పునర్‌వ్యవస్థీకరణ, బలవంతపు రుణ వసూళ్లను నిలిపివేయడంపై చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి కేంద్ర సహాయం అందిన నాటినుంచి నెల రోజుల్లోగా ప్రభావిత రైతులకు వ్యవసాయ ఉత్పాదక రాయితీని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా పంపిణీ చేసేలా వ్యవసాయ, సహకార శాఖ ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. లబ్ధిదారుల జాబితాలను సంబంధిత కలెక్టర్లు వెబ్‌సైట్‌లో పెట్టాలని పేర్కొంది. కరువు సహాయాన్ని కోరుతూ ప్రణాళిక శాఖ వారంలో నివేదిక పంపించాలని సూచించింది. మున్సిపల్‌/పట్టణ ప్రాంతాలను తాగునీటి ప్రయోజనం కోసం వాటిని కరువు ప్రభావిత మండలాలతో సమానంగా పరిగణించాలని స్పష్టం చేసింది.

నల్లగొండలో 20 మండలాల్లో తీవ్ర కరువు

నల్లగొండ జిల్లాలో 28 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. అందులో 20 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయి. 8 మండలాల్లో సాధాకరణ పరిస్థితులు నెలకొన్నాయి.

● నకిరేకల్‌, చండూరు, మర్రిగూడ, చింతపల్లి, నాంపల్లి, నిడమనూరు, దామరచర్ల, అడవిదేవులపల్లి, తిరుమలగిరిసాగర్‌, పెద్దవూర, పీఏపల్లి, నేరడుగొమ్ము, గట్టుప్పల్‌, దేవరకొండ, చందంపేట, గుండ్లపల్లి, కనగల్‌, మునుగోడు, నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాల్లో తీవ్ర కరువు ఉన్నట్లు గుర్తించింది.

● చిట్యాల, కేతేపల్లి, నల్లగొండ, త్రిపురారం, మాడ్గులపల్లి, వేములపల్లి, తిప్పర్తి, మిర్యాలగూడలో సాధారణ కరువు ఉన్నట్లు పేర్కొంది.

ఫ కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం

ఫ జాబితాలో నల్లగొండలో 28,సూర్యాపేట 23, యాదాద్రిలో 17 మండలాలు

ఫ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement