నీటి వాడకంపై కట్టుదిట్టంగా వ్యవహరించాం | - | Sakshi
Sakshi News home page

నీటి వాడకంపై కట్టుదిట్టంగా వ్యవహరించాం

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

మిర్యాలగూడ : నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమకాల్వకు నీరు వదలకుండా.. కుడి కాల్వకు ఎన్నడూ నీరు వదల్లేదని.. నీటి వాడకంపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టుదిట్టంగా వ్యవహరించారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు ప్రారంభం కాగానే తెలంగాణ పవర్‌హౌస్‌ ద్వారా విద్యుత్‌ను ప్రారంభించేవారమని ఈ ప్రభుత్వాల హయాంలో వరదనీరు ప్రారంభమై 20రోజులు గడిచిపోయినా విద్యుత్‌ ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు సాగర్‌ కుడికాల్వకు ఇష్టానుసారంగా నీటిని వదులుకుంటున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. కృష్ణా నది జలాలను 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాలకు తెలంగాణ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు లిఫ్ట్‌ చేయకుండా ఆంధ్రాకు నీరు తరలివెళ్లేలా రేవంత్‌రెడ్డి సహకరించారని ధ్వజమెత్తారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు 700కి.మీ దూరంలో ఉన్న కుప్పానికి నీరు తీసుకెళ్లారని ఆరోపించారు. కేసీఆర్‌ ముందు చూపుతోనే దామరచర్లలో వైటీపీఎస్‌ నిర్మిస్తే.. నేడు అదే రాష్ట్రానికి దిక్కుగా మారిందన్నారు. కేసీఆర్‌ హయాంలో రైతుబీమా, రైతుబంధు, సరిపడా యూరియా, విద్యుత్‌, విత్తనాలు అందించి రైతులను అన్ని విధాలా ఆదుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం ఓటు వేసే పరిస్థితిలో పట్టభద్రులు లేరన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నాయకులు రాకేష్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యూసుఫ్‌, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, బాబయ్య, మట్టపల్లి సైదులు, బాలాజీ, నాగార్జునచారి, శ్రీనివాస్‌రెడ్డి, చిట్టిబాబునాయక్‌, మోసిన్‌అలీ, మల్లయ్య, ఇలియాస్‌, షహనాజ్‌బేగం, శ్రీధర్‌, షోయబ్‌ పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement