అందుబాటులో ఉండే పరికరాలు ఇలా..
నల్లగొండ అగ్రికల్చర్ : రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తెస్తూ, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకు 17 కస్టమ్ హైరింగ్ సెంటర్లను మంజూరు చేసింది. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు యూనిట్ విలువను బట్టి గరిష్టంగా రూ.20 లక్షల వరకు (40 శాతం) సబ్సిడీ అందించనుంది. మంజూరైన 17 సెంటర్లలో జనరల్ కేటగిరీకి 14, ఎస్సీకి 1, ఎస్టీ కేటగిరీకి 2 కేటాయించారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు రైతు మిత్ర గ్రూప్‌లు, మహిళా స్వయం సహాయక సంఘాలు, పీఏసీఎస్‌లు, రైతు పరస్పర ఆసక్తి గల సంఘాలు agrimachinery.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, వ్యవసాయ, సహకార తదితర శాఖల అధికారులతో కూడిన కమిటీ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తుంది.
రైతులకు మేలు.. సంఘాలకు ఆర్థిక ఊతం:
సొంతంగా ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయలేని చిన్న, సన్నకారు రైతులకు ఈ సెంటర్లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. తక్కువ అద్దెకే ఆధునిక సాగు పరికరాలు లభించడంతో రైతులకు సాగు ఖర్చులు తగ్గి, పనులు వేగవంతమవుతాయి. మరోవైపు యంత్రాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆయా రైతు, మహిళా సంఘాలు ఆర్థికంగా బ లోపేతం కావడానికి ఈ పథకం దోహదపడనుంది.
పవర్ టిల్లర్, ఎలక్ట్రిక్ టిల్లర్, డిస్కు ఫ్లౌ, కల్టివేటర్, లెవలింగ్ బ్లేడ్, రోటరేటర్, రోటో పుడ్లర్, రివర్సుబుల్ ఎంబీప్లౌ, సబ్ సాయిలర్, బండ్ పార్మర్, విత్తనాలు ఎరువులు వేసే డ్రిల్, మల్టీ క్రాప్ ప్లాంటర్, రైజ్డ్ బెడ్ ప్లాంటర్, పోస్టు హోల్ డిగ్గర్, ప్లాస్టిక్ మల్చు వేయు యంత్రం, ఫర్టిలైజర్ బ్రాడ్ కాస్టర్, రిడ్జ్ పరో ప్లాంటర్, గడ్డి కలుపుకోసే యంత్రం, పవర్ వీడర్, చేతితో నడిపే నాప్‌సాక్ స్ప్రేయర్, పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్, ట్రాక్టర్‌కు అమర్చే బూమ్ స్ప్రేయర్, కిసాన్ డ్రోన్, కంబైన్ హార్వెస్టర్, మొక్కజొన్న కంబైన్ హార్వెస్టర్, మల్టీక్రాప్ థ్రెషర్, విన్నోయింగ్ ఫ్యాన్, మొక్కజొన్న పొట్టు తీసే యంత్రం, టెలిస్పోపిక్ హార్వెస్టింగ్ పోల్స్, పసుపు ఉడికించేయంత్రం, పసుపు పాలిషర్, వరి మొబైల్ డ్రయ్యర్, స్ట్రా బేలర్, రోటరీ ష్రెడర్, మల్చర్, రోటరీ స్ట్రా స్లాషర్, బ్రష్ కట్టర్ వంటి పరికరాలను కస్టమ్ హైరింగ్ సెంటర్లలో నిర్వాహకులు అందుబాటులో ఉంచనున్నారు.
ఫ జిల్లాకు 17 కస్టమ్ హైరింగ్ సెంటర్లు
ఫ రైతులకు అందుబాటులోకి ఆధునిక యంత్రాలు
ఫ రూ.20 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం


