నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన దుకాణాల టెండర్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. గతంలో కంటే దేవాదాయ శాఖకు భారీగా ఆదాయం పెరిగినప్పటికీ, టెండర్లను ఖరారు చేయకుండా అధికారులు వాయిదా వేయడంపై టెండర్‌దారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ చైర్మన్, అధికారులకు నచ్చిన వ్యక్తులకు టెండర్లు దక్కకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
టెండర్ లేకుండా ఐదు నెలలు కొనసాగింపు
అమ్మవారి ఆలయం వద్ద గతంలో ఉన్న 3 షాపులకు గాను రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. ఏప్రిల్ నెలతో ఆ టెండర్ గడువు ముగిసినప్పటికీ, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మునుపటి టెండర్‌దారుకే మరో ఐదు నెలల పాటు షాపులను కొనసాగించేందుకు అనుమతించారు. ఈ ఐదు నెలల కాలంలో దేవాలయానికి ఎటువంటి ఆదాయం సమకూరలేదని స్థానికులు అంటున్నారు. ఆలయ ఈఓ మోహన్‌బాబును వివరణ కోరగా ఆలయానికి మరింత ఎక్కువ ఆదాయం తీసుకురావాలనే ఉద్దేశంతోనే టెండర్లను వాయిదా వేశామని స్పష్టం చేశారు. ఈ టెండర్ల కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వరాల రమేష్, ఈఓ మోహన్‌బాబు, ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, గ్రామ సర్పంచ్ నేతగాని కృష్ణ, డైరెక్టర్లు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, కమ్మలపల్లి మల్లేశం, రేగట్టే శ్రీనివాస్‌రెడ్డి, ఇరుకుల సంపత్, గద్దగోటి యాదగిరి, కొమ్ము శీను, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఫ చెర్వుగట్టు దుకాణాల టెండర్లలో అధిక ఆదాయం వచ్చినా కేటాయింపుల వాయిదా
ఫ అనుకూలమైన వారికి దక్కలేదని నిలిపివేసినట్టు ఆరోపణలు


