రామగిరి(నల్లగొండ) : ఈ నెల 12న నల్లగొండ జిల్లా కోర్టుతో పాటు జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.హిమబిందు తెలిపారు. కక్షిదారుల సౌకర్యార్థం నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నిడమనూరు న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ బెంచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, రా జీపడే అవకాశం ఉన్న కేసులను లోక్ అదా లత్ ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని కక్షిదారులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
13న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 13వ తేదీ ఉదయం 10గంటలకు నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ బీసీ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–16 సబ్ జూనియర్ బాలబాలికలు 55 కేజీల విభాగం, అండర్–20 జూనియర్ బాలురు బరువు 75 కిలోలలోపు కలిగి ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ మెమో తమ వెంట తీసుకురావాలని కోరారు.
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
పెద్దవూర : ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ) పి.కమలాకర్‌రెడ్డి అన్నారు. గురువారం పెద్దవూర మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఫలితాల సాధనకు గాను ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏసీఎంఓ డీ.వీ.నాయక్, ఇన్‌చార్జ్ ఏటీడీఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్‌ఎం డి.బాలోజీ, హెచ్‌డబ్ల్యూఓ కొల్లు బాలకృష్ణ, ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది ఉన్నారు.
దళితులను కించపర్చిన వారిపై ఎస్పీకి ఫిర్యాదు
కనగల్ : మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను దళితులు ముట్టడించిన అనంతరం అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బోడ స్వామి, అధికార ప్రతినిధి పెరిక అంజయ్య గురువారం నల్లగొండలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫామ్‌హౌస్‌ను శుద్ధిచేయడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందని, దళితులపై వివక్షకు పాల్పడుతున్న వారిపై, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలి
నకిరేకల్ : విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) సుశీందర్‌రావు అన్నారు. నకిరేకల్‌లో జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్ గేమ్స్‌ఫేడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడాపోటలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం హైస్కూల్‌లో మధ్యామ్న భోజనాన్ని పరిశీలించారు. టీచర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, హైస్కూల్ హెచ్‌ఎం రాములు, పీడీలు శైలజ, విద్యాసాగర్‌రెడ్డి, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.


