సమీకృత మార్కెట్ దుకాణాల కేటాయింపు ప్రక్రియపై మార్కెటింగ్ శాఖ అధికారులకు ఇప్పటికే లేఖ రాశాం. వారి నుంచి నిర్ణయం రావాల్సి ఉంది.
–దిలీప్ భార్గవ్, ఏఈ, మున్సిపల్ కార్పొరేషన్
ఫ బీట్ మార్కెట్‌లో రూ.7.70 కోట్లతో 146 దుకాణాల నిర్మాణం
ఫ ప్రారంభోత్సవంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని మార్కెటింగ్ శాఖ
ఫ చిరు వ్యాపారులకు తప్పని నిరీక్షణ
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని రవీంద్రనగర్ కాలనీ బీట్ మార్కెట్‌లో రూ.7.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ పనులన్నీ పూర్తయినా ప్రారంభానికి నోచుకోక వృథాగా పడి ఉంది. చిరు వ్యాపారుల జీవనోపాధి కోసం నిర్మించిన ఈ మార్కెట్‌ను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాంగణమంతా పడావుపడి కనిపిస్తోంది. సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ మార్కెట్‌లో మొత్తం 146 దుకాణాలను అందుబాటులోకి తెచ్చారు. దీనిని వెంటనే ప్రారంభిస్తే 146 మంది చిరు వ్యాపారులకు ఎంతో మేలు చేకూరనుంది. అంతేకాకుండా, రహదారుల వెంట విక్రయించే పండ్లు, కూరగాయల దుకాణాల వల్ల కలిగే రద్దీ సమస్య కూడా తీరుతుందని పట్టణవాసులు భావిస్తున్నారు.
కలెక్టర్ ద్వారా లేఖ..
నగరంలోని వన్‌టౌన్ ప్రాంతం ప్రకాశంబజారులో ఇప్పటికే కూరగాయల మార్కెట్ ఉంది. ప్రస్తుతం టూటౌన్ ప్రాంతంలోనూ ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. నిర్మాణం పూర్తయినందున చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయించాలని మున్సిపాలిటీ అధికారులు గతంలోనే జిల్లా కలెక్టర్ ద్వారా మార్కెటింగ్ శాఖకు లేఖ పంపినప్పటికీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
మొత్తం వ్యయం రూ.7.70 కోట్లు
రవీంద్రనగర్‌లోని మార్కెటింగ్ శాఖకు చెందిన బీట్ మార్కెట్ స్థలంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారు. మొదట్లో దీనిని వెజ్, నాన్–వెజ్ మార్కెట్‌గా నిర్మించాలనుకున్నారు. అయితే సమీపంలో ఆలయం ఉన్నందున నాన్–వెజ్ మార్కెట్‌పై స్థానిక భక్తులు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, దీనిని కేవలం ‘వెజ్ మార్కెట్’గా మారుస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆధునిక హంగులతో నిర్మించేందుకుగాను భారీగా నిధులు వెచ్చించారు. మొదట రూ.4.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించగా, ఆ తర్వాత అదనపు పనుల పేరుతో మరో రూ.3.20 కోట్లు కేటాయించారు. ఇలా మొత్తంగా రూ.7.70 కోట్లు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ, ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌ను వినియోగంలోకి తేకపోతే అందులోని మార్బుల్స్, ఇతర విలువైన సామగ్రి పాడైపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెటింగ్ శాఖ వద్దే పెండింగ్!
అన్ని పనులూ పూర్తయిన ఈ మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, పూలు విక్రయించే అర్హులైన చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయించాల్సి ఉంది. కానీ, మార్కెటింగ్ శాఖ నుంచి స్పందన లేకపోవడంతోనే ఈ మార్కెట్ ప్రారంభం కాకుండా మూలన పడి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి మార్కెట్‌ను ప్రారంభించాలని స్థానిక చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


