నల్లగొండ టౌన్ : పీఆర్సీ, పెండింగ్ సమస్యలపై ఈ నెల 10న వివిధ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు సీఐటీయూ మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, కార్యదర్శి ఎండీ.సలీం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి జేఏసీ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఉచితంగా పోలీస్ ఫిజికల్ ట్రైనింగ్
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్‌లో పోలీస్ ఉద్యోగాలకు ఉచితంగా ఫిజకల్ ఈవెంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు సెంటర్ నిర్వాహకుడు ఎక్స్ ఆర్మీ కొండోజు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని ఆసక్తి గల వారు సెంటర్‌ను లేదా 9010471756 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా అంజన్‌కుమార్
కేతేపల్లి : నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కేతేపల్లి మండలంలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన అల్లి అంజన్‌కుమార్‌యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి బుధవారం రాత్రి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అంజన్‌కుమార్ ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా అంజన్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ రంగం కుదేలు
మిర్యాలగూడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాలకోరు విధానాల వల్ల వ్యవసాయ రంగం కుదేలవుతోందని రైతు సంఘం జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలంలోని చిల్లాపురం గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు. వీర తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేపథ్యం ఉన్న నల్లగొండ జిల్లాలో జరిగే ఈ మహాసభలు భవిష్యత్ ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తాయన్నారు. దేశంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా రైతు ఉద్యమాలను చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మహాసభలు రైతు సమస్యల పరిష్కారానికి శాసీ్త్రయ మార్గాలను చూపే వేదిక కాబోతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, కోట్ల శ్రీనివాస్‌రెడ్డి, బద్దెపాక ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.
విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ నెల 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ నాయకులు మంగళవారం కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భం అని వివరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగాని శ్రీనివాస్‌గౌడ్, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, వెంకట్‌నారాయణరెడ్డి, పిల్లి రామరాజుయాదవ్, వెంకన్న, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, లింగస్వామి, యానాల కరుణాకర్‌రెడ్డి, బలరామ్, నర్సింహ తదితరులు ఉన్నారు.


