సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్రంలో ఐకాన్ ఆస్పత్రి దోపిడీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలిలో ప్రస్తావించారు. దోపిడీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. బుధవారం శాసనమండలిలో స్పెషల్ మెన్షన్ కింద ఎమ్మెల్సీ విజయశాంతి రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ప్రస్తావించారు. మందులు రాసిచ్చేందుకు రూ.1500 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో పేదల ఆరోగ్యాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ ఆస్పత్రులు విపరీతమైన దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. అవసరం లేకపోయినా టెస్టులు, చికిత్స చేయడం.. చివరకు చనిపోయినా వెంటిలేటర్‌పై పెట్టి డబ్బులు గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్మక్కు
ఇటీవల నల్లగొండలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఐకాన్ ఆసుపత్రిలో తనిఖీలు చేశారని.. ఆ ఆస్పత్రిని ప్రారంభించిన కొద్దికాలంలోనే 191 మంది అక్కడ మరణించడం ఆందోళనకరమన్నారు. ముఖ్యంగా ఆర్‌ఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్ముకై ్క ఆస్పత్రికి వచ్చిన వారిని దోచుకుంటుండడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు కుటుంబీకులు ఆతృతలో ఉండటం, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నా వారి ఆతృతను ఆసరాగా చేసుకొని, ఆస్పత్రి వారు ఇచ్చే కమీషన్ కోసం అంబులెన్స్ డ్రైవర్లు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇదే అవకాశంగా ఆస్పత్రి యాజమాన్యం దోచుకుంటోందన్నారు. వైద్యానికి డబ్బులు చెల్లించలేక పుస్తెలు అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై మొత్తం వైద్యారోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు. ఇందులో వారితోపాటు కలెక్టర్లను కూడా భాగస్వాములను చేసి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఫ నల్లగొండ ఐకాన్ ఆస్పత్రిపై శాసనమండలిలో సుఖేందర్‌రెడ్డి ప్రస్తావన
ఫ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై స్పెషల్ మెన్షన్ కింద ప్రస్తావించిన విజయశాంతి
ఫ ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వెల్లడించిన మండలి చైర్మన్ గుత్తా
ఫ టాస్క్‌ఫోర్స్‌ను నియమించామన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ


