నల్లగొండ : నల్లగొండ జిల్లా పంతాయతీ అధికారిగా వనం తరుణ్ చక్రవర్తి నియమితులయ్యారు. నేరుగా నియమితులైన జిల్లా పంచాయతీ అధికారుల (డీపీఓలు) పోస్టింగ్‌లలో మార్పులు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షణలో ఉన్న అధికారులకు మిగిలిన శిక్షణ కాలాన్ని రద్దు చేసి, రెగ్యులర్ డీపీఓలుగా విధులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వనపర్తి జిల్లాలో శిక్షణ పొందుతున్న వనం తరుణ్ చక్రవర్తికి నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారిగా (డీపీఓ) పోస్టింగ్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య తెలిపారు.
నదుల్లో నీటి వాటాను సాధించాలి
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్న నీటిని అంచనా వేసి మనకు రావాల్సిన వాటాను తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు, నాలుగు లేబర్ కోడ్స్, వ్యవసాయ నల్ల చట్టాలను దొంగ చాటున తీసుకొచ్చిందని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కరువు అంచనాలను వేయాలని కోరారు. వ్యవసాయ రంగ పరిస్థితులను చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ పరిరక్షణకు
రాజీలేని పోరాటం
రామగిరి (నల్లగొండ) : ఆర్టీసీ పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు సాగిస్తున్న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్)ను రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు పిలుపునిచ్చారు. నల్లగొండ డిపోలో రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కే.ఎస్.రెడ్డి, రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, కోశాధికారి బైరు శ్రీకాంత్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, ఎం.సి.మౌళి, నరసింహయ్య, గద్దర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఐక్యతతో న్యాయవ్యవస్థ బలోపేతం
రామగిరి(నల్లగొండ) : న్యాయశాఖ ఉద్యోగులు బలంగా ఉంటేనే దేశంలో న్యాయవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున సంఘం ప్రధాన కార్యదర్శి మాతంగి వీరబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో విశేష సేవలందించిన ఎస్‌వి.సుబ్బయ్య, రమణారావుల కృషిని కొనియాడారు. దేశవ్యాప్తంగా న్యాయశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సేవా నిబంధనల సవరణ, సమాన వేతనం, పదోన్నతులు, బదిలీలు, వైద్య సదుపాయాల కల్పనపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయశాఖ ఉద్యోగుల ఐక్యతే తమ అసలైన బలమని, ఉద్యోగుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.


