ఫ తాలు పేరిట కొర్రీలు..
ఫ ధాన్యం దిగుమతి
చేసుకోకుండా నిలిపివేత
ఫ మిల్లుల వద్ద ఆగిపోయిన లారీలు
శాలిగౌరారం : ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు ఆ పంటల దిగుబడులను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే అరంభంలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. శాలిగౌరారం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైన మొదటి రోజే.. అడ్డంకులు ఎదురయ్యాయి. తాలు ఉందంటూ లారీల్లోని ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా నిలిపివేశారు. దీంతో రెండురోజులుగా మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలను నిలిపివేశారు. దీంతో కేంద్రంలో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలో 15 కేంద్రాలు ప్రారంభం
శాలిగౌరారం మండలంలో 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను.. ఇప్పటికే 15 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మరో ఐదు కేంద్రాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. శాలిగౌరారం, శాలిలింగోటం, తక్కెళ్లపహాడ్ కేంద్రాల నుంచి కాంటా వేసిన 8 లారీల ధాన్యం అదేరోజు సాయంత్రం ట్యాగింగ్ చేసిన మిల్లులకు పంపారు. మిల్లుల వద్దకు చేరుకున్న లారీలను సంబంధిత మిల్లుల యజమానులు ధాన్యంలో తాలు ఉందని కొర్రీలు పెట్టి దిగుమతి చేసుకోలేదు. దీంతో లారీలు రెండు రోజులుగా మిల్లుల వద్ద నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు జరిగిన తొలిరోజే కొర్రీలు మొదలయ్యాయంటే తర్వాత రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


